'అంధకారమైన క్షీణయుగంలో జన్మించి, ఆ కాలపు దుర్నీతిని ఏకాకిగా ఎదిరించాడు వేమన. వేమన స్వరం కఠినంగా, వాక్కు పరుషంగా, విమర్శ కర్కశంగా ఉన్నందున అతడు కఠిన స్వభావుడని అర్థం చేసుకోకూడదు. వేమన సాధు స్వభావుడు. అనురాగ పూరితుడు, సహనశీలి' అంటారు ఆయన పద్యాల ఆధారంగా నార్ల వెంకటేశ్వరరావు. విగ్రహారాధనను వ్యతిరేకించిన సాంఘిన విప్లవకారునిగా కూడా చూసారాయన. 'వేమన' ఆకర్షించని స్వదేశి, విదేశీ సాహితీ విమర్శకులు లేరనే చెప్పాలి. తెలుగులో వేమన జీవితం గురించి పరిశోధనలు చేసిన వారిలో వంగూరి సుబ్బారావు, వావిళ్ళ వెంకటేశ్వర శాస్త్రి, కొమర్రాజు వెంకట లక్ష్మణరావు, పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రి, బండారు తమ్మయ్య, ఆరుద్ర, రాళ్ళపల్లి అనంత కృష్ణశర్మ, వేమూరి విశ్వనాథశర్మ, కట్టమంచి రామలింగా రెడ్డి, త్రిపురనేని వెంకటేశ్వరరావు, ఎన్.గోపి తదితరులు ఉన్నారు. వారు ప్రసిద్ధమైన విశ్లేషణా రచనలను వెలువరించారు. బ్రౌన్ ద్వారా వేమన పద్యాలు 1839లో పుస్తక రూపంలో ప్రథమంగా వెలుగులోకి వచ్చాయి.
వేమన ప్రజాకవి. 1652 - 1730 మధ్యకాలంలో జీవించాడని, కొండవీటి రెడ్డి రాజవంశానికి చెందిన వాడని చెప్పే కధనాలున్నాయి. సి.పి.బ్రౌన్ ప్రకారం ... ఇతను జంగమ కులానికి చెందిన శివకవి. కడప మండలంలో చిన్న పల్లెలో మధ్య తరగతిలో జన్మించాడనే పరిశోధక కధనాలున్నాయి. అతని జీవితానికి చెందిన అంశాలున్న పద్యాలను ప్రముఖంగా ప్రస్తావించిన పరిశోధకులున్నారు. 'నందన సంవత్సరమున / పొందుగ కార్తీకమందు బున్నమి నాడీ/' 'ఊరు కొండవీడు వునికి పశ్చిమం వీధి/ మూక చింతపల్లె మొదటి వీధి' అనే పద్యం వల్ల ఆయన జన్మ వృత్తాంతం గురించి కొందరు వివరించారు. బండారు తమ్మయ్య విశ్లేషణలకు హేతుబద్ధమని అంగీకరించారు ఆచార్య ఎన్.గోపి. వేమన కులం విషయంలో వివిధ కథనాలున్నాయి.
గ్రియర్సన్ అనే సాహిత్య పరిశోధకుడు వేమన 16వ శతాబ్ధానికి చెందినవాడని నిర్ణయించాడు. భారతీయ భాషా సాహిత్యాల అధ్యయనానికి తన జీవితాన్ని అంకితం చేసిన ప్రముఖ విదేశీ విద్వాంసుడు జి.వి.గ్రియర్సన్ 'నేటి కవులందరిలో అత్యంత ప్రసిద్ధిని పొందిన కవి వేమన. వేమనకు ఆపాదించబడని సామెత కాని, సూక్తిగాని ఉండటం చాలా అరుదని అభిప్రాయపడ్డారు. సి.పి.బ్రౌన్ సహితం తను రచించిన పుస్తకం పీఠికలో 'నాకు లభించిన పద్యాలు మొత్తం 2,500. వీటిని పోల్చినప్పుడు సమానమైన పద్యాలు మొత్తం రెండు వేలకు కొంచెం మించి ఉన్నట్లు తేలింది' అని రాసుకున్నారు. బ్రౌన్ తరువాత డా||జి.యు. షాప్, మేజర్ ఆర్.ఎం. మెక్ డోనాల్డ్ గ్రంథానికి వేమనపైన ప్రత్యేకమైన పరిశోధనలు చేశారు. అబేదుబారు రచించిన గ్రంథానికి సంపాదకీయ వ్యాసం రాసిన పోప్ 'వేమన పద్యాల మాధుర్యాన్ని మించిన మరో కవిత లేదని' పేర్కొన్నారు. విదేశీయుల్ని వేమన ఆకర్షించినంత గొప్పగా తెలుగు సాహిత్యమంతటిలో మరొక కవి రచనలు ఆకర్షించ లేదనిమ్యాక్ డోనాల్డ్ అభిప్రాయం.
వేమన తన రచనలను పండితుల కోసం రాయలేదు. తాను నిరంతరం సంచరిస్తున్న సమాజం, తనకు జరిగిన అవమానాలు, ఆస్వాదించిన ఆనందాలు, ఆర్థిక పరమైన కష్టాలు, నష్టాలు, ఆనాటి సమాజంలో ఆచారాలు, సంప్రదాయాల వెనుక ఒక వర్గపు స్వార్థం, మరో వర్గపు మౌఢ్యం, ప్రజల్లోని నిరక్షరాస్యత, అమాయకత్వం, అంటరానితం, మతాల పేరిట, విగ్రహారాధన పేరిట జరుగుతున్న దోపిడీ ... వంటివి ఆయనలో సమాజం పట్ల ఒక విధమైన జాలిని పెంచాయి. అతనిలో నిజాయితీని ప్రశ్నించాయి. నిలదీయమనే కోరిక పెంచాయి. ఈ కారణాల చేతనే ఆయన రచనలను పెక్కుమంది తిరస్కరించారని, ఆదరించలేదని, ఆయనను వెలివేసారని అంటారు నార్ల. 1829లో కావలి వేంకటరామస్వామి గారు నూట ఎనిమిది మంది కవుల చరిత్రతో ఒక పుస్తకాన్ని రచించారు. వీరంతా దక్షిణ భారతదేశంలో ప్రాచీనార్వాచీన ప్రసిద్ధులు. వీరిలో నలభై ఏడుగురు తెలుగు కవులు. వీరిలో వేమనకు చోటివ్వలేదు. 'తెలుగు ప్రజలు వేమన కవిత్వాన్ని అధికంగా అభిమానిస్తారని పాశ్చాత్యుడైన పోప్ పేర్కొన్నారు. వేమనలోని హేతువాదం, ఏకేశ్వరోపాసన, మొరటు పద ప్రయోగాలు ఛార్లెస్- ఇ-గోవర్‌ను ఆకట్టుకొని వేమనపై పద్య రచన చేశారు. ఇందుకు బ్రౌన్ రచనలే ఆధారమని చెప్పారు. సి.పి.బ్రౌన్ తనకు లభించిన పద్యాలను మతం, నీతి, వ్యంగ్యం, తాత్వికం, ప్రకీర్ణం అనే పద్ధతిలో వర్గీకరించారు.
వేమనను తనువంతా విస్తరింపచేసుకొన్న పాశ్చాత్యుడు క్యాంబెల్. ఆయన మద్రాస్ క్రిస్టియన్ కాలేజీ పత్రికలో 'నిశ్చయంగా వేమన ప్రజాకవి. ఆయన రాసింది పండితులకు కాదు. నిరక్షరాస్యులైన గ్రామీణ ప్రజలకు. వేమన ప్రసిద్ధికి కారణం ఆయన ప్రబోధాలు మాత్రమే కాదు; సరళము, శక్తిమంతమూ అయిన కవితా శైలి కూడా కారణమే' అని రాశారు. ఇది శతశాతం సత్యం. క్యాంబెల్ 'మేము వేమనను తప్ప వేరే దైవాన్ని పూజింపమని ఆయన మా ఇలవేల్పుగా పేర్కొన్న వ్యక్తిని సహితం కలుసుకున్నారట !
వేమనను గురించి పరిశోధన చేసిన ప్రథమాంధ్రుడు కె.వి.లక్ష్మణరావు. ఆంధ్రదేశంలో చారిత్రక, సాహిత్య పరిశోధనలకు కూడా ఆయనే మార్గదర్శి. ఆ తరువాత ఎందరో వేమనపైన శ్రద్ధ చూపారు. బ్రౌన్, క్యాంబెల్ తదితరుల బాటలో మరికొందరు పరిశోధించి, విశేష కోణాలను ఆవిష్కరించారు. వేమన పద్యాల్లోని మానవతాధర్మం, సర్వమానవ సమానత్వం, కులవివక్షలోని 'శూన్యత', 'నైతికత', మూఢ నమ్మకాల ఖండన వంటి విషయాలను ప్రస్తావించారు. తెలుగు పరిశోధకులు సహితం వేమనలోని నిజమైన తత్వసారాన్ని వెలుగులోకి తెచ్చారు. వివక్ష సమాజంపై ఈటెల్లా విసిరిన వేమన ఆటవెలది పద్యాల అవసరం ఇప్పుడూ చాలా ఉంది.
- భమిడిపాటి భవానీ శంకర్
94928 58395










