Sep 04,2023 09:29

ఆదరించేవారు కరువై చాలీచాలని సంపాదనతో ఎన్నో కళల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. వాటిల్లో ఒకటే కర్నాటకకు చెందిన ఉడిపి కళ. ఏకదారంలో సున్నితమైన పోగులతో ఎంతో హాయిగొల్పే ధారణకు ఉడిపి చీరలు పెట్టింది పేరు. కాటన్‌ ప్రపంచంలో ఒకప్పుడు ఉడిపి చీరలు గొప్పగా వెలుగొందాయి. జిఐ ట్యాగ్‌తో ప్రభుత్వ గుర్తింపు కూడా వచ్చింది. కానీ కాలక్రమేణా ఆ చీరలు మార్కెట్లో మాయమయ్యాయి. ఉడిపి చీరలను మక్కువగా ధరించే ఎంతోమంది అయ్యో అని బాధపడ్డారు. కానీ, మమతారాయ్ అలా ఊరుకోలేకపోయారు. తరచూ ఉడిపి చీరలను ధరించే ఆమె 2016లో విక్రయించిన చీరే ఆఖరిది అని దుకాణ యజమాని చెప్పడంతో ఎంతో తల్లడిల్లారు. ఎలాగైనా ఆ కళను పునరుద్ధరించాలని కంకణం కట్టుకున్నారు.

11

         ఉడిపి చీరలు 1844 సంవత్సరం నాటికే ఉనికిలో ఉన్నాయి. కాలక్రమేణా బాసెల్‌ మిషన్‌తో మలబార్‌ ఫ్రేమ్స్‌ లూమ్స్‌ పరిచయమై, దక్షిణ కన్నడనాట ఉడిపి జిల్లాల్లో చేనేత ముఖ్య ఆదాయవనరుగా రూపాంతరం చెందింది. దీంతో ఎంతోమంది ఉడిపి చేనేత కార్మికులకు పని లేకుండా పోయింది. ఆదాయం లేక వారంతా క్రమంగా కళ నుండి నిష్క్రమించారు.
          ఈ విషయం గ్రహించిన మమతా 2018లో 'కడకీ' ట్రస్ట్‌ని స్థాపించారు. ఆ నేత కార్మికులకు చేయూతగా నిలిచారు. అయితే ఇదంతా అంత సులభంగా జరగలేదు. నేత సొసైటీలను ఎన్నింటినో సందర్శించినా ఉడిపి కళాకారులను గుర్తించడం చాలా కష్టమైంది. అతి కష్టం మీద రెండు జిల్లాలకు గాను 45 మంది నేత కార్మికులను గుర్తించారు. అయితే వారంతా వృద్ధ కళాకారులు. 50 ఏళ్లు పైబడిన వారు. వారి మాటల్లో కూడా భవిష్యత్తు మీద ఎటువంటి ఆశలేని నిరాశ ప్రతిధ్వనించింది. ఈ విషయం కూడా ఆమెని కంటి మీద కునుకులేకుండా చేసింది. వీరి తరువాత ఆ కళ శాశ్వతంగా కనుమరుగైపోతుందన్నది ఆమె బెంగ. అందుకే దీన్ని ఉపాధిమార్గంగా మార్చాలని, యువ నేత కార్మికులను ఈ కళవైపు మళ్లించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
       'నేత కార్మికులను ప్రోత్సాహించాలంటే ఈ చీరలకు మార్కెట్‌ కల్పించాలి. అందుకు మేము సోషల్‌ మీడియా వేదికలను ఉపయోగించుకున్నాం. రెండు జిల్లాల్లో ఎగ్జిబిషన్లు, ఆర్గానిక్‌ ఉత్పత్త్తుల స్టాల్స్‌లో పాల్గొని చీరలను విక్రయించేవాళ్లం. ఆన్‌లైన్‌ ద్వారా చీరల అమ్మకం విరివిగా జరిగితే నేతన్నకు బహుమతులు అందించడం, అదనపు జీతాలు, వైద్య సదుపాయాలు వంటివన్నీ కల్పించడం మొదలుపెడతామని భరోసా కల్పించాం. సహజసిద్ధ ఉత్పత్తులతో, సున్నితమైన పోగులతో తయారైన ఈ చీరలను గతంలో రూ.500 నుండి రూ.750 లకే అమ్మేవారు. కానీ ట్రస్ట్‌ చొరవతో రూ.1100 నుండి రూ.2300 ధర పలుకుతున్నాయి. ఇది నేతన్నలకు ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుంద'ని మమతా రారు చెబుతున్నారు.
          మూడు దశాబ్దాలుగా కొత్త నేత కార్మికులు ఈ కళ వైపు చూడలేదు. 50 ఏళ్ల లోపు వారితో 25 మంది సభ్యులతో శిక్షణా తరగతులను నిర్వహించాలని గతంలో ప్రభుత్వం ఆదేశించింది. అయితే ఆచరణలో దీనికి పెద్దగా ఆదరణ రాలేదు. దీంతో 'కడకి' ట్రస్ట్‌ 15 రోజుల శిక్షణా తరగతులను 6 గురు నేత కార్మికులతో నిర్వహించడం మొదలుపెట్టింది. మొదట్లో నేతన్నలు ఇటువైపుగా రాలేదు. అయినా నిరుత్సాహపడకుండా ముందుకే సాగింది. 2020 నాటికి నాబార్డు చొరవతో 20 మందికి తక్కువగా శిక్షణ ఇప్పించే ఒప్పందంతో తరగతులు ప్రారంభించింది. మొదటిబ్యాచ్‌లో 5 గురు వచ్చారు. రెండు నెలలపాటు శిక్షణా తరగతులు నిర్వహించారు. 'ప్రస్తుతం డిజైన్‌ స్కూల్స్‌ నుండి కొంతమంది విద్యార్థులు మమ్మల్ని సంప్రదిస్తున్నారు. ఈ మార్పు వల్ల మాకు చాలా సంతోషంగా ఉంటోంది. ఈ పరిణామం నూతన ఆవిష్కరణలకు నాంది పలుకుతుంది. కళ అంతరించిపోకుండా ఒకరి నుండి మరొకరికి బదిలీ అవుతుంది' అని మమతా చెబుతున్నప్పుడు ఆమె మాటల్లో ఎంతో సంతోషం ధ్వనించింది. ఐదు నెలల క్రితం ఉడిపి జిల్లా పంచాయతి, ఉడిపి సొసైటీ, వేవర్‌ కమ్యూనిటీలు 25 మంది సభ్యులతో శిక్షణా తరగతులను ప్రారంభించినట్లు కూడా ఆమె చెబుతున్నారు. కళ, కళాకారులు కనుమరుగవ్వకుండా ఉండాలంటే మమతా లాంటి వారు చొరవ చూపాలి. అప్పుడే ప్రాచీన కళలు సజీవంగా ఉంటాయి. ఆ దిశగా అడుగులు వేసిన మమతారారు ఇప్పుడు ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు.