- తెలంగాణ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో... నిందితుల బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : రాజకీయాల కోసం కోర్టులను వేదిక చేసుకోవడంపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితులు దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ వాయిదా వేసింది. టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ముగ్గురు నిందితులు రామచంద్ర భారతి అలియాస్ సతీష్ శర్మ, నందకుమార్, సింహయాజి హైకోర్టు రిమాండ్ విధించడాన్ని సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను సోమవారం సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బిఆర్ గవాయి, జస్టిస్ బివి నాగరత్నల ధర్మాసనం విచారించింది. తొలుత హైకోర్టులో విచారణ ఏమైందని ధర్మాసనం ఆరా తీసింది. విచారణ ప్రారంభమైందని, ప్రస్తుతం ఇంకా కొనసాగుతోందని తెలంగాణ ప్రభుత్వం తరపు సీనియర్ న్యాయవాది సిద్ధార్ధ లూత్రా తెలిపారు. బెయిలు పిటిషన్లపై సెషన్స్ న్యాయమూర్తి విచారణ చేస్తున్నారని పేర్కొన్నారు. దర్యాప్తుపై స్టే విధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లతో సంబంధం లేదని, విచారణ సోమవారానికి వాయిదా వేయాలని నిందితుల తరపు సీనియర్ న్యాయవాది కెవి విశ్వనాధన్ కోర్టుకు వివరించారు. రాజకీయ ప్రయోజనాల నిమిత్తం తెలుగు రాష్ట్రాల్లోని కేసులకు కోర్టులను వేదికలుగా పరిగణిస్తున్నారని వ్యాఖ్యానించిన ధర్మాసనం తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది.