సాదాసీదాగా ఉన్న ఓ అమ్మాయి వీధుల్లో నడుచుకుంటూ వెళుతూ రోడ్డు పక్కనే ఉన్న ఓ లగ్జరీ బ్రాండ్ బ్యూటీ ఉత్పత్తుల షోరూమ్‌లోకి ప్రవేశిస్తుంది. అక్కడ ఉన్న వస్తువులను చూసి ఎంతో సంబరపడిపోతుంటుంది. కళ్లల్లో మెరుపుతో సంతోషంగా గెంతుతూ షోరూమ్ అంతా కలియతిరుగుతుంది. ఓ చోట ఆమె కాళ్లు ఆగిపోతాయి. కారణం.. అక్కడ కొన్ని ఉత్పత్తులను పేర్చి ఉంచారు. దాని వెనుక ఓ పెద్ద ఫొటో కనపడుతుంది. అది ఆ బాలిక ఫొటోనే. ఇదంతా ఓ యాడ్ షూటింగ్. అందులో నటించింది 14 ఏళ్ల మలీషా ఖర్వా. 'కలలు కనండి.. అవి పెద్దవైనా.. చిన్నవైనా నెరవేర్చుకోండి' అంటూ ఆ యాడ్ ముగుస్తుంది. అవి యాడ్‌లో వినిపించే మాటలైనా వాటిని అక్షరసత్యాలు చేసింది మలీషా. ఈ జీవితం ఆమె ఊహించనిది.. కాని ఆమె కల దాన్ని నెరవేర్చింది.. ఎలాగో చూద్దాం..

'నేను మురికివాడలో నివసిస్తున్నానని అందరూ అంటారు. కానీ నేను నా జీవితాన్ని ప్రేమిస్తాను. నా కుటుంబానికి కడుపునిండా అన్నం పెట్టేందుకు సూపర్ మోడల్‌గా రాణించాలని కలలు కంటున్నాను' అంటున్న మలీషా ముంబయి ధారవి మురికివాడలో నివసిస్తోంది. పై వ్యాఖ్యలు ఆమె ఇన్‌స్ట్రాగ్రామ్ ఖాతాలో కనిపిస్తాయి. తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి బట్టలు లేక చాలీచాలని గుడిసెలో తలదాచుకునే కుటుంబంలో పుట్టిన మలీషా జీవితం ఇప్పుడు ఎవ్వరూ ఊహించని స్థాయికి వెళ్లింది. ఇదంతా ఒక్కరోజులో జరగలేదు. హాలీవుడ్ నటుడు రాబర్ట్ హోఫమన్ 2020లో ధారవికి వచ్చిన రోజు నుండి ఇది మొదలైంది. ఓ మ్యూజిక్ వీడియో కోసం ముంబయి వచ్చిన అతడు మలీషాను చూశాడు. తన ఇన్‌స్టాలో ఆమె గురించి రాసుకొచ్చాడు. మోడల్ కావాలను కుంటున్న ఆమె కల నెరవేరడం కోసం నిధులివ్వమని తన అనుచరులను అభ్యర్థించాడు. ఇదంతా జరిగి మూడేళ్లు కావస్తోంది. ప్రస్తుతం ఆమెను 22 లక్షల మందికి పైగా అనుసరిస్తున్నారు. 'స్లమ్ యువరాణి' పేరుతో తన ఇన్‌స్టా ఖాతాలో ఆమె రాసే స్టోరీస్‌ను లక్షలమంది అనుసరిస్తారు. ఈ మూడేళ్లలో మలీషా అనేక యాడ్స్‌లో నటించింది. పలు మ్యాగజైన్‌ల కవర్‌పేజీలపై ఆమె ఫొటోలు అచ్చయ్యాయి. 'లైవ్ యువర్ ఫెయిర్‌టేల్' షార్ట్ ఫిల్మ్‌లో కూడా నటించి ఎంతోమందిని ఆకర్షించింది.
తాజాగా ఫారెస్ట్ బ్యూటీ ఉత్పత్తులను మార్కెటింగ్ చేసే లగ్జరీ కంపెనీ కొత్తగా ప్రారంభించిన 'యువతి సెలక్షన్' యాడ్‌లో నటించింది. ఆ యాడ్ షూటింగ్‌ను సదరు కంపెనీ సోషల్‌మీడియాలో షేర్ చేసింది. దీంతో మలీషా పేరు మరోసారి గట్టిగా వినబడుతోంది. యువతను ఆకర్షించడమే లక్ష్యంగా పెట్టుకుని చేసిన ఆ యాడ్‌లో మలీషా నటించడంతో ఎంతోమంది ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
'మీరు ఎక్కడి నుండి వచ్చినా.. మీ కల ఎంత పెద్దదైనా, చిన్నదైనా నెరవేర్చుకోండి. కలలు అందరికీ ఉంటాయి' అంటున్న మలీషా 'ఈ యాడ్‌లో చేయడం నాకు ఏదో పెద్ద ఉద్యోగం వచ్చినట్లుగా ఉంది. నేను మోడల్‌గా ఉండాలనుకుంటున్నా. కానీ అదే సమయంలో విద్యకు మొదటి ప్రాధాన్యత ఇస్తాను' అంటోంది. కష్టాలు వచ్చాయని.. కలలు నెరవేరవని.. కొంతమంది ఎప్పుడూ నిరుత్సాహపడుతుంటారు. అయితే ఒక్కసారి మలీషా గురించి తెలుసుకుంటే తమ కలలు సాకారం చేసుకునేందుకు ఈసారి గట్టిగా ప్రయత్నిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు.










