పిల్లలు పొద్దున్నే ఒక పట్టాన లేవరు. స్కూలుకు తయారుచేయాలంటే కత్తిమీద సామే అవుతోంది ప్రతి తల్లికీ. టైంకి లేవరు. బ్రష్ చేయరు. స్నానం, టిఫిన్ సంగతి సరేసరి.. కాస్త పెద్ద పిల్లలైతే వాళ్ల పనులు వాళ్లే చేసుకుంటారు.
మరి చిన్న పిల్లల సంగతో.. వారికి ఏం చెప్పాలి?
మనం ఎలా చెబితే వాళ్లకు అర్థం అవుతుంది?
చిన్న పిల్లలున్న ప్రతి తల్లినీ, తండ్రినీ వెంటాడే ప్రశ్నలివి.
లాస్య, కొడుకు చింటూను అదే పనిగా నిద్ర లేపుతున్నా వాడు లేవడం లేదు. వంట చేసుకుంటూ పదే పదే బెడ్ రూంకి వెళ్లడం చింటూను లేపడం ఆమె దినచర్యలో భాగమవుతోంది. మొదట్లో విసుగుపుట్టి బలవంతంగా లేపి కూర్చొబెట్టేది. అప్పుడు వాడు ఏడుపు లంకించుకుని ఒకపట్టాన ఆపేవాడు కాదు. అదో సెర.. అందుకే ఈమధ్య కాస్త బుజ్జగిస్తూ.. బతిమాలుతూ నిద్రలేపడం మొదలుపెట్టింది. ఎన్నాళ్లు ఇలా.. అమ్మ మాట చింటూ వినాలంటే ఏం చేయాలి?
'చింటూ.. పొద్దున్నే నిద్రలేవడం మంచి అలవాటు.. త్వరగా బ్రష్ చేసి, స్నానం, టిఫిన్ చేసేసి స్కూలుకు టైంకి తయారవ్వడం గుడ్ హ్యాబిట్ తెలుసా.. రేపటి నుండి నువ్వు ఈ మంచి అలవాట్లు నేర్చుకోవాలి. చెడ్డ అలవాట్లను వదిలేయాలి' అని లాస్య చాలా సీరియస్‌గా టిఫిన్ చేస్తున్న చింటూతో చెబుతోంది. చింటూ అమ్మ వంక అమాయకంగా చూస్తూ.. 'అమ్మా.. మంచి అలవాట్లు.. చెడ్డ అలవాట్లు అంటే ఏంటి?' అని అడిగాడు.. నిజమే కదా.. ఆ పిల్లవాడికి వాటి అర్థం తెలుస్తుందా.. కాని మనలో చాలామంది తల్లిదండ్రులు పదే పదే పిల్లలతో అవే మాటలు అంటుంటారు.
అందుకే పిల్లలకు అలవాట్ల గురించి అర్థమయ్యేలా చెప్పాలి. అది రోజువారీ పని అని, దినచర్యలో భాగమని చెప్పాలి. ఉదయం లేవడం దగ్గర నుండి రాత్రి పొద్దుపోయే వరకు చేసే అన్ని పనులు అలవాట్లేనని వివరించాలి. మంచి, చెడుల గురించి చెప్పేటప్పుడు.. సమయానికి అన్ని పనులు చేయడం వల్ల ఎవరికీ ఇబ్బంది ఉండదని, అలా చేయకపోవడం వల్ల ఇంట్లోనూ, స్కూల్లోనూ చాలా ఇబ్బందిగా ఉంటుందని చెప్పాలి. ఉదాహరణకు ఆలస్యంగా నిద్ర లేవడం వల్ల అన్ని పనులు ఆలస్యంగా అయి స్కూలుకు లేటవుతుందని చెప్పండి. అప్పుడు అందరిముందు టీచరు కోప్పడతారని, ఆ ప్రభావం చదువుపై పడి చదువులో వెనకబడతారని చెప్పండి. స్కూలుకు టైంకి వెళ్లి, పాఠాలు శ్రద్దగా వింటే చదువులో ముందుండవచ్చని వివరించండి. అప్పటికీ పిల్లలు వినకపోతే.. స్కూల్లో టీచర్లు పిల్లలను కోప్పడితే అమ్మానాన్న బాధపడతారని చెప్పండి. అప్పుడు తాము చేసే పనుల వల్ల అమ్మానాన్న ఇబ్బంది పడతారని పిల్లలకు అర్థమవుతుంది.
మంచి నడవడికకు ఇంటి నుండే మొదటి బీజం పడాలి. నిద్రలేవడం చాలా సాధారణ విషయమైనా అక్కడ నుండే వారికి అలవాట్లను పరిచయం చేయాలి. పాఠాలు శ్రద్ధగా వినడం, హోంవర్క్స్ చేయడం, పెద్దవాళ్లను గౌరవించడం, డబ్బు ఆదా చేసుకోవడం వంటి విషయాలన్నీ అలవాట్లేనని చెప్పాలి. మంచి, చెడ్డల వ్యత్యాసం కూడా తెలియజేయాలి. కాస్త ఓర్పుతో.. సహనంతో వారికి అర్థమయ్యేలా చెప్పాలి. ఒక్కసారే.. వెంటనే కాకపోయినా నిదానంగా వారి అలవాట్లను మార్చుకుంటూ ఉంటారు. పిల్లలు కదా, మనం ఎంత ఓపిగ్గా చెబితే అంత శ్రద్ధగా వింటారు.










