- కాటన్ బ్యారేజీ వద్ద 2వ ప్రమద హెచ్చరికను దాటి ప్రవాహం
- ధవళేశ్వరం వద్ద 15.75 అడుగులు
- భద్రాచలం వద్ద 54.30 అడుగుల నీటిమట్టం
ప్రజాశక్తి - రాజమహేంద్రవరం ప్రతినిధి : గోదావరి కాటన్ బ్యారేజీ వద్ద మహోగ్ర రూపం దాల్చింది. లంకలను చుట్టిముట్టింది. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. శనివారం రాత్రి నుంచి క్రమంగా పెరిగిన గోదావరి ఆదివారం ఉదయానికి మరింత వేగం పుంజుకుంది. ఇక్కడ గంట గంటకు వరద తీవ్రత పెరిగింది. ఉదయం 11.30 గంటలకు 15.75 అడుగులకు నీటి మట్టం చేరుకుంది. ఇక్కడ రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. బ్యారేజీ నుండి సముద్రంలోకి 15,96,464 నీటిని విడుదల చేస్తున్నారు. భద్రాచలం వద్ద వరద నిలకడగా ఉంది. అక్కడ మూడో ప్రమాద హెచ్చరిక ఇంకా అమల్లోనే ఉంది.
ప్రస్తుతం భద్రాచలం వద్ద 54.39 అడుగుల నీటి మట్టం నమోదైంది. వరద నీటి ప్రవాహం పెరగడంతో లంకల ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో అన్ని రేవులు, స్నానఘట్టాలను అధికారులు మూసేశారు. పి.గన్నవరంలో కనకాయలంక నీట మునిగింది. అక్కడ ప్రజలు పడవులపై ప్రయాణాలు సాగిస్తున్నారు. రాజమండ్రిలో బ్రిడ్జి లంక ప్రజలని పునరావాస కేంద్రాలకు తరలించారు. కోనసీమ జిల్లా మామిడి కుదురు మండలం అప్పనివాని లంక, అప్పనపల్లి, పాసర్ల పూడి, పి.గన్నవరం మండలంలో 30 గ్రామాలు పూర్తిగా నీట మునిగాయి.










