
- మెస్మా ప్రయోగించినా లెక్కచేయని సిబ్బంది
ముంబయి : విద్యుత్ పంపిణీ వ్యవస్థని ప్రైవేటీకరణ చేయవద్దని కోరుతూ గత కొంతకాలంగా మహారాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ కార్మికులు, ఇంజనీర్లు ఆందోళనలు, నిరసనలు చేపడుతున్నారు. అయినా వాటిని లెక్క చేయకుండా ప్రభుత్వం మొండిపట్టుదలతో ప్రైవేటీకరణ దిశగా ముందుకు సాగుతుండడంతో బుధవారం నుండి 72 గంటల సమ్మెకు విద్యుత్ ఉద్యోగ సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు వైఖరితో నిరంకుశ మెస్మా చట్టం-2017ను అమలు చేసినా దాన్ని ఉల్లంఘించి మరీ వేలాది మంది విద్యుత్ ఉద్యోగులు బుధవారం నాటి సమ్మెలో పాల్గొన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వానికి చెందిన విద్యుత్ ఉత్పత్తి, ప్రసార, పంపిణీ సంస్థలకు చెందిన సిబ్బంది అందరూ సమ్మె బాట పట్టారు. కాగా, ఈ సమ్మె కార్యాచరణలో పాల్గొన్న మహారాష్ట్ర ఎలక్ట్రిసిటీ వర్కర్లు, ఇంజనీర్లను సిఐటియు అభినందించింది. ఈ మేరకు సిఐటియు ప్రధాన కార్యదర్శి తపన్ సేన్ ఒక ప్రకటన జారీ చేశారు. మహారాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న కక్ష సాధింపు చర్యలను సిఐటియు తీవ్రంగా ఖండించింది. సమ్మె చేస్తున్న కార్మికులకు బాసటగా నిలబడాల్సిందిగా దేశవ్యాప్తంగా గల వివిధ రంగాలకు చెందిన కార్మికులు, ప్రజలను కోరింది. గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఈ చారిత్రక సమ్మెలో మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వ విద్యుత్ కంపెనీలకు చెందిన 86వేల మంది కార్మికులు, ఇంజనీర్లు పాల్గొంటున్నారు. వీరిలో 42 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులే వున్నారు. నవీ ముంబయిలోని భాండూప్ సర్కిల్ విద్యుత్ పంపిణీ సేవలను అదానీ గ్రూపునకు కేటాయించేందుకు అనుమతించిన నీచమైన కుట్రకు వ్యతిరేకంగా ఈ సమ్మెకు పిలుపిచ్చారు. అదానీ గ్రూపు - అదానీ ఎలక్ట్రిసిటీ నవీ ముంబయి లిమిటెడ్, అదానీ ట్రాన్స్‌మిషన్ లిమిటెడ్‌లు దాఖలు చేసిన పిటిషన్ తప్పుడు సమాచారంతో కూడినదని, అపోహలు సృష్టించేలా వుందని, అసమగ్రంగా వుందని, తప్పులు తడకలతో వుందని సిఐటియు ప్రకటన పేర్కొంది. ఆ గ్రూపు తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో వుందని, పైగా విద్యుత్ పంపిణీ సేవల్లో ఎలాంటి అనుభవం లేదని పేర్కొంది. ఏ కంపెనీకైనా లైసెన్స్ మంజూరు చేయాలంటే ముందుగా ఆ కంపెనీకి తగిన పెట్టుబడుల సామర్ధ్యం వుండాలని, పైగా రుణాలు పొందేందుకు అర్హత వుండాలని లేదా ప్రవర్తనా నియమావళి వుండాలని పేర్కొంటున్న విద్యుత్ చట్టం, 2003లో సెక్షన్ 14 (లైసెన్స్ మంజూరు) కింద చాలా బలమైన, చెల్లుబాటయ్యే, సమర్ధనీయమైన అభ్యంతరాలు ఇవని సిఐటియు పేర్కొంది.
మంగళవారం నుండి జరుగుతున్న మూడు రోజుల సమ్మె వంద శాతమూ విజయవంతమైదని పేర్కొంది. మహారాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ ఉత్పత్తి, ప్రసార, పంపిణీ సంస్థలు సమ్మె బాటలో నడిచాయి. అదానీ గ్రూపును విద్యుత్ పంపిణీ రంగంలోకి చొప్పించేందుకు గత రెండు మాసాలుగా జరుగుతున్న యత్నాలను కార్మికులు, ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కానీ ప్రజలు, కార్మికులు వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలను రాష్ట్ర ప్రభుత్వం పెడచెవిన పెట్టింది.
అదానీ కోరల నుండి మహారాష్ట్ర విద్యుత్ సంస్థను కాపాడుకోవడానికి సమ్మెకు దిగడం తప్ప మరో మార్గం లేదని తపన్‌సేన్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సమ్మె కారణంగా ప్రభుత్వ సేవలకు ఎలాంటి భంగం వాటిల్లినా, ప్రజలు ఇబ్బందులు పడినా అందుకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ మొండిపట్టుదలతో వ్యవహరిస్తూ, మూర్ఖత్వంతో ప్రైవేటీకరణ దిశగా చేపడుతున్న చర్యలకు వ్యతిరేకంగా విద్యుత్ కార్మికుల ప్రతిఘటనకు ఈ సమ్మె ఒక ఉదాహరణ అని అన్నారు. తక్షణమే మెస్మా చట్టాన్ని ఉపసంహరించాలని సిఐటియు డిమాండ్ చేసింది. సమ్మె చేస్తున్న కార్మికులకు అనుకూలంగా సంబంధిత సమస్యలను పరిష్కరించాలని కోరింది. సమ్మె చేస్తున్న మహారాష్ట్ర విద్యుత్ ఉద్యోగులకు మద్దతుగా సంఘీభావంగా అన్ని రంగాలకు చెందిన కార్మికులు, ప్రజలు ఈ కార్యాచరణలో పాల్గొనాలని సిఐటియు పిలుపిచ్చింది.
- పెట్రో సమాఖ్య అభినందన
భారత పెట్రోలియం, గ్యాస్ కార్మికుల సమాఖ్య (పిజిడబ్ల్యుఎఫ్‌ఐ) కూడా సమ్మె చేస్తున్న మహారాష్ట్ర విద్యుత్ సిబ్బందిని అభినందించింది. పెట్రోలియం, గ్యాస్ రంగం కూడా ఇదే రీతిన ప్రైవేటీకరణ దాడులను ఎదుర్కొంటోందని, ఈ నేపథ్యంలో విద్యుత్ సిబ్బంది ఇబ్బందులను తాము అర్ధం చేసుకున్నామని సమాఖ్య అధ్యక్ష కార్యదర్శులు నోజెన్ చుటియా, ప్రదీప్ మయేకర్‌లు పేర్కొన్నారు. తక్షణమే వారి సమస్య పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
- ప్రయివేటీకరించం : ఫడ్నవీస్
సమ్మెతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. సమ్మెలో భాగస్వాములుగా ఉన్న 32 సంఘాల ప్రతినిధులతో రాష్ట్ర ప్రభుత్వం బుధవారం మధ్యాహ్నం చర్చలు చేపట్టింది. విద్యుత్ పంపిణీ సంస్థలను ప్రయివేటీకరణ చేయబోమని, ఉద్యోగుల, కార్మికుల సంక్షేమానికి హానీ చేసే ఏ చర్యలూ తీసుకోబోమని ఈ చర్చల అనంతరం మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రకటించారు. ప్రభుత్వం ప్రయివేటీకరణ చేయబోమని స్పష్టమైన ప్రకటన చేయడంతో ఉద్యోగులు, కార్మికులు సమ్మెను విరమించినట్లుగా కథనాలు వచ్చాయి.