ఆ మాట మంచిదే
ఆత్మహత్యలాపితే
దెబ్బ తిన్న కుర్రకారు
ఎమోషన్లలో మోషన్
ఆపితే కౌన్సెలింగ్ ఓకె
ఒక ప్రాణం మిగిలినట్టే
ఒక దీపం నిలిపినట్టే!
ఆత్మహత్యలన్నింటికీ
కౌన్సిలింగే హౌల్డింగా?
అయితే ఏ కౌన్సిలింగుతో
ఆకలి చావును ఆపగలవు
ఇంకెలాంటి కౌన్సెలింగుతో
బ్యాంకు అప్పు వసూళ్ళకు
వీధిన పడేసిన రైతు పరువు
ఆత్మహత్య నాపగ ఓదార్చగలవు
కడుపు నిండని చెమట జీవులు
పనుల కోసం పరాయి ఊళ్ళకెళ్ళి
బతక (బతుకు) లేక ఉరి దారి పడితే
ఏ కౌన్సెలింగుతో దారి చూపగలవు?
కోట్లు మింగి ఎగ్గొట్టిన కార్పొరేటుకు
విదేశీ పరుగు వీసాల కౌన్సెలింగా
కష్టంతో జాతి ఆకలాపే శ్రములకు
వీధివసూళ్ళ ఉరితాళ్ళ ఊరేగింపా?
మాట మంచిదే కదా అంటూ
అన్నింటికీ అదే మం(చి)దనడం
పాలక విధాన హత్యలు దాచేసి
ఆత్మహత్యను బూచీ చేయడమేగా!
('ఆత్మహత్యల నిరోధంలో మీడియాదే కీలక పాత్ర' అని
ఓ అధికారి ఉపదేశం చదివాక)
- ఉన్నం వెంకటేశ్వర్లు
8790068814










