హైదరాబాద్ : '' 14 ఏండ్లుగా మోడీ సర్కార్ మహిళా బిల్లును ఎందుకు ఆమోదించడం లేదు ? మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం వచ్చే డిసెంబర్‌లో మరోసారి దీక్ష చేస్తా '' అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో కవిత మాట్లాడుతూ ... మహిళా రిజర్వేషన్లు తన వ్యక్తిగత ఎజెండా కాదని అన్నారు. దేశంలోని మహిళలందరూ చట్టసభల్లో రిజర్వేషన్లు కోరుకుంటున్నారని తెలిపారు. మహిళల రిజర్వేషన్ల కోసం అంబేద్కర్ కూడా కొట్లాడారని గుర్తుచేశారు. ప్రస్తుతం పార్లమెంటులో మహిళలు కేవలం 12 శాతం మాత్రమే ఉన్నారని అన్నారు. తొలి లోక్‌సభలో 8 శాతం మహిళా ఎంపీలే ఉంటే.. ఇప్పుడు ఆ సంఖ్య 12 శాతానికి మాత్రమే చేరిందని చెప్పారు. మణిపూర్‌లో ఇప్పుడు ఇద్దరు మహిళలు మాత్రమే ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారని అన్నారు. సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలుగానే మహిళలు మిగిలిపోవాలా ? అని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు.
కిషన్‌రెడ్డి, బిజెపి నాయకులు అనవసరంగా తనపై విమర్శలు చేస్తున్నారని ఎమ్మెల్సీ కవిత అన్నారు. 2010 రాజ్యసభలో ఆమోదం పొందిన మహిళా రిజర్వేషన్ బిల్లు.. 2023 వచ్చినా ఎందుకు ఆమోదం పొందడం లేదని ప్రశ్నించారు. 14 ఏండ్లుగా మోడీ సర్కార్ మహిళా బిల్లును ఎందుకు ఆమోదించడం లేదని నిలదీశారు. మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం వచ్చే డిసెంబర్‌లో మరోసారి దీక్ష చేస్తామని ఆమె ప్రకటించారు. ఈ దీక్షకు సోనియాగాంధీ, ప్రియాంక గాంధీ, స్మఅతి, ఇరానీ సహా మహిళా నేతలు అందరినీ ఆహ్వానిస్తామని తెలిపారు.