- ఐదు రోజుల్లో 13 పశువులు మృత్యువాత
- వేగంగా వ్యాపిస్తోన్న వ్యాధి
ప్రజాశక్తి- కర్నూలు ప్రతినిధి : పశువులకు ప్రాణాంతకమైన ముద్ద చర్మం (లంపీ స్కిన్) వ్యాధి కర్నూలు జిల్లాలో ప్రబలుతోంది. గత ఐదు రోజుల్లో ఒక్క ఆస్పరి మండలంలోనే 12 పశువులు, కోసిగి మండలం చింతకుంటలో ఒక ఎద్దు మరణించాయి. జిల్లాలో దాదాపు 300 పశువులు ఈ వ్యాధి బారిన పడ్డాయి. దీంతో, పశుపోషకులు వణికిపోతున్నారు. తొలుత పశువుల కళ్లు, ముక్కు, నోటి నుండి చొంగ కారడం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత చర్మం కింద, నోటి చిగురు, ముట్టె మీద, ముక్కు దూలం మీద కణితులు, బుడిపెలు వంటివి ఏర్పడుతున్నాయి. చివరగా మెడ, తొడల దగ్గర లింప్ గ్రంధులు వాచి, పొదుగు, రొమ్ము భాగం, కీళ్లలో నీరు చేరి పశువు నీరంసంగా మారి మృత్యువాత పడుతున్నాయి. ఆస్పరి మండలం ఐకనల్లు, కారుమంచి, బిణిగేరి గ్రామాల్లో ఐదు రోజుల క్రితం ఒక్కో ఎద్దు చొప్పున మృతి చెందాయి. ఆ తర్వాత రోజుల్లో ఎనిమిది ఎద్దులు, రెండు ఆవు దూడలు, ఒక ఆవు, ఒక గొర్రె ఈ లక్షణాలతోనే మృత్యువాతపడ్డాయి. ఈ మండలంలో ఇప్పటి వరకూ 200 పశువులు ఈ వ్యాధి బారిన పడ్డాయి. కోసిగి, దేవనకొండ, పత్తికొండ మండలాల్లోనూ పశువులకు ఈ వ్యాధి ప్రబలింది. వ్యాధి సోకిన పశువు నోరు, నాసికా కుహరం, కంటి నుండి కారే స్రవాలలో వైరస్ ఎక్కువ మోతాదులో ఉంటోంది. పశువుల మేత, నీటి తొట్టెల ద్వారా ఇతర పశువులకు ఈ వైరస్ వ్యాపిస్తోంది. పాలు తాగే దూడలకు తల్లి పాల ద్వారా లేదా పొదుగుపై ఉన్న చర్మం పొక్కుల ద్వారా సోకుతుంది. దీంతో, వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. ఈ వ్యాధికి ఇప్పటి వరకూ పూర్తి స్థాయిలో చికిత్స లేదని, ఆంబోతు వీర్యం ద్వారా కూడా వేరే పశువులకు ఈ వ్యాధి సోకుతుందని పశుసంవర్థక శాఖాధికారులు చెప్తున్నారు. వ్యాధి రాకుండా ముందస్తుగా గోట్ ఫాక్స్ వ్యాక్సిన్ వేయించాలని, వ్యాధి వస్తే యాంటీ బయాటిక్స్ వాడాల్సి ఉంటుందని తెలిపారు. వ్యాధి వేగంగా ప్రబలుతున్న ఆస్పరి మండలంలో ప్రభుత్వ పశు వైద్యశాలల్లో యాంటీబయాటిక్స్ మందులు లేకపోవడంతో ప్రయివేట్ మెడికల్ షాపుల్లో కొనుగోలు చేస్తున్నారు. వ్యాధి బారిన పడిన పశువులకు ఏడు రోజులపాటు వరుసగా యాంటీ బయోటిక్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇందుకు ఒక్కో పశువుకూ రూ.4 వేల వరకు వెచ్చించాల్సి వస్తోంది.
ఎద్దు చనిపోయింది
ముద్దచర్మం వ్యాధి సోకి నా ఎద్దు చనిపోయింది. 15 రోజుల పాటు యాంటీబయోటిక్స్ వేయించాను. ఇందుకు రూ.15 వేలు ఖర్చయినా ఫలితం లేక పోయింది. ఒక ఎద్దు కొనుగోలుకు రూ.40 వేలు వరకూ అవుతోంది. ప్రభుత్వం ఆదుకోవాలి.
-టి.సూర్యనారాయణ, బిణిగేరి గ్రామం
దోమలే కారణం
లంపి స్కిన్ డిసీజ్ అనేది కాప్రిపాక్స్ వైరస్ వల్ల పశువులు, గేదెలకు వచ్చే వైరల్ వ్యాధి. ఇది దోమల వల్ల వస్తుంది. ఈ వ్యాధి సోకకుండా ముందు జాగ్రత్తగా గోట్ ఫాక్స్ టీకా వేస్తున్నాం. పశువుల పాకలో దోమతెర ఏర్పాటు చేయాలి. పొగ పెట్టాలి. యాంటీబయాటిక్స్ కొరత అక్కడక్కడా ఉంది.
- వెంకటసుబ్బయ్య, పశుసంవర్థక శాఖ ఎడి










