Nov 27,2022 07:07

త కొన్ని నెలలుగా, భారతదేశం అంతటా లంపి చర్మ వ్యాధి వ్యాపిస్తోంది. ఇది పశువులకు వచ్చే వైరల్‌ వ్యాధి. ఇది జంతువు శరీరం మొత్తాన్ని కప్పివేస్తుంది. గుజరాత్‌, రాజస్థాన్‌, పంజాబ్‌, హర్యానా, మహారాష్ట్ర, కర్ణాటక, గోవా, ఛత్తీస్‌గఢ్‌, ఒరిస్సా, మధ్యప్రదేశ్‌, జార్ఖండ్‌, ఆంధ్రప్రదేశ్‌తో సహా పద్దెనిమిది పైగా రాష్ట్రాల్లో ఈ వ్యాధి కారణంగా మూడు లక్షలకు పైగా పశువులు చనిపోయాయి.
          లంపి స్కిన్‌ డిసీజ్‌ రాజస్థాన్‌లో అత్యంత వేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటి వరకు గుజరాత్‌, రాజస్థాన్‌ లోనే 70,000 కంటే ఎక్కువ జంతువులు...ప్రధానంగా ఆవులు మరణించాయి. దాదాపు రెండు లక్షల పశువులకు ఈ వ్యాధి సోకింది. గ్లోబల్‌ అలయన్స్‌ ఫర్‌ వ్యాక్సిన్స్‌ అండ్‌ ఇమ్యునైజేషన్‌ నివేదిక ప్రకారం లంపి చర్మ వ్యాధి కాప్రిపోక్స్‌ అని పిలువబడే వైరస్‌ వల్ల వస్తుంది. ఇది ప్రపంచ వ్యాప్తంగా పశువులకు ముప్పుగా మారుతోంది. ఇది గోట్‌ పాక్స్‌, షీప్‌ పాక్స్‌ వైరస్‌ కుటుంబానికి సంబంధించినది. దీనివల్ల వచ్చే జ్వరం, చర్మం మీది బుడిపెలు మరణానికి కూడా దారితీస్తాయి.
            ఈ వ్యాధి వల్ల దీర్ఘకాలిక బలహీనత, పాల ఉత్పత్తి క్షీణించడం, పెరుగుదల మందగించడం, వంధ్యత్వం, గర్భస్రావం మరియు కొన్నిసార్లు మరణానికి దారితీస్తుంది. ఈగలు, రక్తం పీల్చే దోమలు, పేలు ద్వారా ఈ వ్యాధి ఇతర జంతువులకు వ్యాపిస్తుంది. ప్రస్తుతానికి లంపి వ్యాధికి వ్యాక్సిన్‌ అందుబాటులో లేదు. జంతువుల్లో కనిపిస్తున్న లక్షణాలను బట్టి చికిత్స అందిస్తున్నారు. వ్యాధి నిర్మూలన కష్టతరమైనది. అయితే ఈ వ్యాధిని నియంత్రించడానికి ముందస్తుగా గుర్తించడమే మెరుగైన మార్గమని వైద్యులు చెబుతున్నారు.
 

- డా||యం. సురేష్‌ బాబు