ప్రజాశక్తి - ఆలమూరు (అంబేద్కర్ కోనసీమ) : మండల పరిధిలోని పెదపళ్ళలో సర్పంచ్ ఏడిద సత్యశ్రీ మెహర్ ప్రసాద్, సొసైటీ చైర్ పర్సన్ నెక్కంటి వెంకట్రాయుడు (బుజ్జి), వైసిపి గ్రామ అధ్యక్షుడు గొడవర్తి వెంకటేష్ బుధవారం పశు వైద్య శిబిరాన్ని ప్రారంభించగా, వైద్యాధికారి సుభాష్ చంద్ర ఆధ్వర్యంలో 300 పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేశారు. ఈ సందర్భంగా పశువైద్యాధికారి సుభాష్ చంద్ర మాట్లాడుతూ ... పశువులకు గాలికుంటు వంటి సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు. ముందస్తు అనగా వ్యాధులు సంక్రమించిన తర్వాత కంటే రాకముందే జాగ్రత్త చర్యలు చేపట్టామన్నారు. ప్రభుత్వమే ఉచితంగా గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు పంపిణీ చేస్తుందన్నారు. దానిలో భాగంగానే మండల పరిధిలోని పశువుల అన్నింటికి కూడా ఈ గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో గొడవర్తి రుద్రయ్య చౌదరి (బాబి), గొడవర్తి నాగయ్య, గ్రామ వెటర్నరీ పశు వైద్యులు ప్రకాష్, పశు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.










