పంచాయతీ సర్పంచుల ఆవేదన
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : ఆర్థిక సాయం లేక కునారిల్లిపోయిన పంచాయతీలకు ఇప్పుడు మరో కొత్త భయం వచ్చిపడింది. వర్షాకాలంలో గ్రామాల్లో మురుగుకాల్వలు, చెత్త నిర్వహణ వంటి పనులు చేపట్టాలన్నా రూపాయి లేకపోవడంతో సర్పంచులు తీవ్రస్థాయి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడ చెత్త తీయించాలన్నా జేబులో డబ్బులు పెట్టుకోవాల్సి వస్తుండటంతో మానసిక ఒత్తిడికి గురవుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పంచాయతీల్లో వర్షాలకాలంలో సహజంగానే నిర్వహణ ఖర్చు ఎక్కువగా ఉంటుంది. వాస్తవంగా పంచాయతీలకు కేటాయించే నిధుల్లో 15 శాతం పారిశుధ్య నిర్వహణకు ఖర్చు చేయాలి. అయితే వర్షాకాలంలో ఇది కొంచం ఎక్కువగానే ఉంటుంది. సహజంగా పంచాయతీల్లో వర్షాకాలం రావడానికి ముందే కాలువలు శుభ్రం చేయించడం, పిచ్చిమొక్కలు తొలగించడం, బ్లీచింగ్ పెట్టుకోవడం, దోమలు రాకుండా ఆయిల్‌బాల్స్ ఏర్పాటు చేసుకోవడం వంటి పనులన్నీ ముందుగానే చేసుకుంటారు. వీటితోపాటు వర్షాకాలంలో సీజనల్‌గా వచ్చే వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మంచినీటి నిర్వహణ, వర్షాకాలంలో నీరు కలుషితం కాకుండా చూసుకోవడం, బ్లీచింగ్ వంటి పనులన్నీ పంచాయతీ పరిధిలోనే చేయాల్సి ఉంటుంది. అనుకోని విధంగా ఎక్కడైనా అంటువ్యాధులు ప్రబలితే అక్కడ సున్నం జల్లించడం, నిరంతరం సిబ్బందిని పెట్టి పర్యవేక్షించడం వంటి పనులూ సర్పంచులే చేయాలి. ప్రస్తుతం పంచాయతీల్లో నిధులు లేకపోవడంతో ఏమి చేయాలో దిక్కుతోచని పరిస్థితి సర్పంచులకు ఏర్పడింది. మరోవైపు కేంద్రం రూ.998 కోట్లు విడుదల చేసి 69 రోజులు దాటిపోతోంది. అయినా పంచాయతీల ఖాతాల్లో రూపాయి పడలేదు. ఎన్నికల సమయంలో ప్రతిష్టకుపోయి పెద్దఎత్తున డబ్బు ఖర్చు చేసి గోళ్లూడగొట్టుకున్న సర్పంచులందరూ నేడు లబోదిబోమంటున్నారు. ఖర్చుపోతే పోయింది కనీసం పనులన్నా జరిగితే గ్రామంలో తలెత్తుకోని తిరగొచ్చని, ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల వచ్చిన నిధుల్లో సుమారు 336 కోట్లు ఖాతాల్లో వేస్తామని ప్రొసిడింగ్స్ ఇచ్చినా ఇంతవరకు డబ్బులు జమకాలేదని సర్పంచుల సంక్షేమ సంఘం కార్యదర్శి కృష్ణమోహన్ పేర్కొన్నారు. ఇలాగైతే వర్షాకాలంలో పంచాయతీల నిర్వహణ ఎలాగని ఆయన ప్రశ్నించారు. అసలే డబ్బులు లేవనుకుంటుంటే వచ్చిన పన్నుల డబ్బును కూడా వాలంటీర్లు, కార్యదర్శుల వేతనాల పేరుతో మినహాయించుకుంటున్నారని సర్పంచుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పాపారావు పేర్కొన్నారు. అంటువ్యాధులు ప్రబలేకాలమని, నిధులు లేకపోతే అదుపు చేయడం కష్టమని,ఖాతాల్లో ఉన్న నిధులు వెనక్కు లాగేసుకుని సర్పంచులను రోడ్డున పడేశారని సర్పంచుల సంఘం నాయకులు వై.వి.బి.రాజేంద్రప్రసాదు వివరించారు. దీనిపై ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నామని తెలిపారు. త్వరలోనే కేంద్రానికి ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు.










