Apr 21,2023 10:06

ఐరాస : కోవిడ్‌ మహమ్మారి లాక్‌ డౌన్‌లు, ఆరోగ్య సంరక్షణకు అంతరాయాల కారణంగా 2019-21 మధ్య ప్రపంచ వ్యాప్తంగా6 కోట్ల 70 లక్షల మంది పిల్లలు సాధారణ వ్యాక్సిన్‌లను పాక్షికంగా లేదా పూర్తిగా కోల్పోయారని ఐక్యరాజ్యసమితి సమగ్ర శిశుఅత్యయిక నిధి (యునిసెఫ్‌) బుధవారం వెల్లడించింది.6.7 కోట్ల మంది పిల్లల్లో 4.8 కోట్ల మంది సాధారణ వ్యాక్సిన్‌లను పూర్తిగా కోల్పోయారని యునిసెఫ్‌ తాజా నివేదిక తెలిపింది. 112 దేశాల్లో ముఖ్యంగా ఆఫ్రికా, దక్షిణాసియా దేశాల్లో పిల్లలు ఎక్కువగా నష్టపోయారని ఐరాస పిల్లల ఏజెన్సీ ఆందోళన వ్యక్తం చేసింది. కోవిడ్‌కు ముందు 86 శాతంగా ఉన్న సాధారణ వ్యాక్సినేషన్‌ కోవిడ్‌ మహమ్మారి దెబ్బకు 81 శాతానికి పడిపోయింది. 2008 తరువాత ఇంత తక్కువకు పడిపోవడం ఇదే మొదటిసారి. దీంతో పిల్లల్లో రోగ నిరోధక శక్తి పెరుగుదల నిలిచిపోయిందని యునిసెఫ్‌ నివేదిక పేర్కొంది. టీకాలు ప్రతి సంవత్సరం 44 లక్షల మంది పిల్లలను కాపాడతాయి. టీకాల విషయంలో ఎవరూ వెనకబడకూడదు అన్న ఐరాస 2030 లక్ష్యం నెరవేరాలంటే ఈ టీకాల కార్యక్రమాన్ని ముమ్మరం చేయాలి. ఎక్కువ మంది పిల్లలు ఆరోగ్యంగా, దీర్ఘకాలం జీవించేలా చేయడంలో టీకాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. 1963లో టీకా కార్యక్రమం చేపట్టక ముందు తట్టు వ్యాధితో యేటా 26 లక్షల మంది పిల్లలు చనిపోయేవారు. తట్టు వ్యాధికి టీకాలు వేశాక ఈ మరణాలు చాలా వరకు తగ్గిపోయాయి. యునిసెఫ్‌ ఇమ్యునైజేషన్‌ కార్యక్రమానికి నిధుల కొరత వెంటాడుతోంది. ఐరాస వేదికపై పెద్ద పెద్ద మాటలు చెప్పే దేశాలు ఈ టీకా కార్యక్రమానికి నిధులు అందించడంలో వెనకబడుతున్నాయని యునిసెఫ్‌ నివేదిక పేర్కొంది.