Jul 21,2023 15:51

బ్రసీలియా :   చిన్న రైతుల నుండి ఆహార సేకరణను  బ్రెజిల్‌ అధ్యక్షుడు లూలా డ సిల్వా అనుమతించారు. అలాగే ప్రజలకు నాణ్యమైన ఆహారం అందించేందుకు గాను ఆహార సేకరణ కార్యక్రమం (పిఎఎ)తో పాటు కమ్యూనిటీ కిచెన్స్‌ ప్రొగ్రామ్‌లకు ఆమోదం తెలిపారు.   దీనిలో భాగంగా ఆహార ఉత్పత్తుల కొనుగోళ్లలో కనీసం 30 శాతం చిన్న రైతుల నుండి సేకరించాలని తెలిపారు. గురువారం ప్లానాల్లో ప్యాలెస్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ ప్రకటన చేశారు. బ్రెజిలియన్‌ ప్రజలకు నాణ్యమైన ఆహారం అందించేందుకు ప్రభుత్వం పెట్టుబడి పెడుతోందని అన్నారు. దీంతో పజలకు అవసరమైన కేలరీలు, మాంసకృత్తులను హక్కుగా పొందుతారు. పిల్లలు తగినంత ఆహారాన్ని పొందుతారని, దేశంలో ఆకలి చావులను నివారించవచ్చని లూలా పేర్కొన్నారు. సమాజం ఖర్చు మరియు పెట్టుబడిని అర్థంచేసుకునే విధానాన్ని మార్చడానికి చేసే ప్రయత్నాలలో భాగమే ఈ ప్రక్రియ అని ట్వీటర్‌లో పేర్కొన్నారు. ప్రభుత్వం ఆరోగ్యం, విద్యపై పెట్టుబడి పెడుతోందని, ఖర్చు చేయడం లేదని అన్నారు. తమ ప్రభుత్వం ప్రజల జీవితాలను మెరుగుపరిచేందుకు యత్నిస్తోందని అన్నారు. పిఎఎలో ముఖ్యమైన పలు మార్పులు చేసినట్లు ఈ సందర్భంగా లూలా ప్రకటించారు. కమ్యూనిటీ కిచెన్‌లను ఏర్పాటు చేయడంతో పాటు చిన్న , మధ్య తరహా గ్రామీణ రైతులకు సహాయం చేయడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని అన్నారు. దీంతో కుటుంబ రైతుల విక్రయాల్లో పెరుగుదల ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమం అమలులో కనీసం 50 శాతం మహిళలు పాల్గనవచ్చని పేర్కొన్నారు. కుటుంబ వ్యవసాయం ఏడాదికి 2,48,000 టన్నుల ఆహారాన్ని అందించే సామర్థ్యాన్ని కలిగి ఉన్నట్లు వ్యవసాయ అభివృద్ధి మంత్రిత్వ శాఖ పేర్కొంది.