తరచూ బొప్పాయి పండును ఆహారంగా తీసుకుంటుంటే శరీరానికి కావలసిన విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. ఇందులో పపెయిన్ అనే పదార్థం ఉండటం వలన జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. ఉదర సంబంధమైన జబ్బులను మటుమాయం చేసేందుకు బొప్పాయి పండు చాలా ఉపయోగకరంగా ఉంటుందంటున్నారు ఆరోగ్య నిపుణులు.
- బొప్పాయి పండును చిన్న పిల్లలకు గుజ్జుగా చేసి నాలుగో నెలనుంచి తినిపించవచ్చు. యుక్తవయస్సులో ఉన్నవారు దోరగా పండిన పండును తినవచ్చు. కొలెస్ట్రాల్ అసలు ఉండదు. క్యాలరీలూ తక్కువే. కాబట్టి ఎవరైనా ఈ పండును తినొచ్చు.
- కంటికి సంబంధించిన రోగాలు రాకుండా ఈ పండులోని బిటాకెరోటిన్ తోడ్పడుతుంది. బొప్పాయిలో సమృద్ధిగా లభించే విటమిన్ సి దంతాల, చిగుళ్ళ ఆరోగ్యానికి, రక్తవృద్ధికి, రోగనిరోధక శక్తికి తోడ్పడుతుంది. పచ్చికాయ అధిక రక్తపోటుని నియంత్రిస్తుంది.
- విటమిన్ బి నోటి పూత, తెల్లమచ్చలు, పెదాల పగుళ్లు రాకుండా కాపాడుతుంది. కెరోటిన్, ఎ, బి, సి, ఇ విటమిన్లు, ఖనిజాలు, ఫ్లేవొనాయిడ్లు, ఫొలేట్లు, పాంతోనిక్ ఆమ్లాలు, పీచు వంటి పోషకాలు బొప్పాయిపండులో పుష్కలం. మామిడి పండు తర్వాత బొప్పాయిలోనే మనకు అధిక పరిమాణంలో విటమిన్ ఎ లభిస్తుంది. దీనివల్ల సీజనల్ రోగాలు దరిచేరవు.
- బొప్పాయి మంచి సౌందర్య సాధనంగా కూడా పనిచేస్తుంది. దీనిలో తెల్లని గుజ్జు ముఖానికి రాయడం వల్ల మంచి మెరుపు వస్తుంది. మొటిమలూ తగ్గుతాయి. బొప్పాయి ఫేస్‌ప్యాక్ జిడ్డు చర్మానికి ఎంతో మంచిది.