నూజెండ్ల (గుంటూరు) : టిడిపి నేత లోకేష్ బుధవారం నూజెండ్ల మండలంలో యువగళం పాదయాత్ర చేపట్టారు. ఉప్పలపాడులో నూజెండ్ల మండల రైతులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. కొత్త ఉప్పలపాడు, తలార్లపల్లి, గొల్లపాలెం, త్రిపురాపురం గ్రామాల్లో నాలుగేళ్లుగా మౌలిక సదుపాయాలు లేవని, తమ సమస్యలను పరిష్కరించాలంటూ అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని రైతులు తెలిపారు. కొత్త ఉప్పలపాడు గ్రామంలోని లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నాలుగు గ్రామాలకు సాగు, తాగు నీరు అందించాలని అధికారులను ఎన్నిసార్లు అడిగినా పట్టించుకోడం లేదన్నారు. టిడిపి అధికారంలోకి వచ్చాక తమ గ్రామాలకు సాగు, తాగు నీరు అందించాలన్నారు. రైతుల వినతులకు లోకేష్ స్పందిస్తూ ... ముఖ్యమంత్రి జగన్ కు అడ్డగోలు దోపిడీపై ఉన్న శ్రద్ధ సాగునీటి ప్రాజెక్టులపై లేదన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సాగు, తాగునీటి ప్రాజెక్టులు నిర్వీర్యమయ్యాయని విమర్శించారు. టిడిపి పాలనలో సాగునీటి ప్రాజెక్టులు, వనరులపై రూ.68,294 కోట్లు ఖర్చుచేశామని లోకేష్ తెలిపారు. జగన్ సిఎం అయ్యాక టీడీపీ చేసిన ఖర్చులో నాలుగోవంతు కూడా ఖర్చుచేయలేదన్నారు. ఎత్తిపోతల పథకాలకు కరెంటుబిల్లులు కట్టలేక మూలనబెట్టిన దివాలాకోరు ప్రభుత్వం రాజ్యమేలుతోందని మండిపడ్డారు. టిడిపి అధికారంలోకి వచ్చాక లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటుచేసి కొత్త ఉప్పలపాడు, తలార్లపల్లి, గొల్లపాలెం, త్రిపురాపురం గ్రామాల సాగునీటి సమస్య పరిష్కరిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు.










