Aug 13,2023 15:22

ప్రజాశక్తి - మేడికొండూరు: టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర ఆదివారం మేడికొండూరు మండలం సిరిపురం గ్రామం నుంచి ప్రారంభమైంది. సిరిపురం గ్రామ శివారులో ఏర్పాటు చేసిన బస నుంచి పాదయాత్రగా నారా లోకేష్‌ గ్రామంలోనికి ప్రవేశించాడు. లోకేష్‌కు సిరిపురం గ్రామ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. సిరిపురం జంక్షన్‌లో జిల్లా తెలుగు యువత ఆధ్వర్యంలో మిరప కాయలతో ఏర్పాటు చేసిన గజమాలతో ఆయనను సత్కరించారు. అనంతరం గ్రామ పురవీధులలో అందర్నీ ఆప్యాయంగా పలకరించుకుంటూ పాదయాత్ర కొనసాగించారు. లోకేష్‌ వెంట టిడిపి తాడికొండ నియోజకవర్గ ఇన్చార్జ్‌ తెనాలి శ్రావణ్‌ కుమార్‌ ముందుండి గ్రామంలో తలెత్తుతున్న సమస్యలపై వివరిస్తూ పాదయాత్రను కొనసాగించారు.