Nov 27,2022 07:22

చలికాలం వచ్చిందంటే చాలు పెదవులు పగిలి ఇబ్బంది పెడతాయి. పెదాలు పొడిగా మారి, చర్మం చీలి ఒక్కోసారి రక్తం కూడా వస్తుంది. ఆ నొప్పి, మంట భరించలేనిది. అందుకే పెదాలు పగలకుండా, పగిలినప్పుడు మృదువుగా చేయడానికి కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుంది.

  •  బాదం నూనెలో విటమిన్‌ ఎ, విటమిన్‌ ఇ, విటమిన్‌ డి, పొటాషియం, ఐరన్‌, కాల్షియం, జింక్‌, ఫాస్పరస్‌, మాంగనీస్‌, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌ ఉంటాయి. ఈ పోషక కారకాలు పెదాలను మృదు వుగా మారుస్తాయి. పగుళ్లు రాకుండా రక్షిస్తాయి. స్నానం తర్వాత పెదవులను శుభ్రం చేసి బాదం నూనెను రాసి సున్నితంగా మర్దన చేస్తూ ఉండాలి. దాంతో రోజంతా పెదాలపై తేమ ఉండి పగలకుండా ఉంటాయి.
  •  కొబ్బరి నూనెలో కొవ్వు ఆమ్లాలు తేమను కలిగిస్తాయి. రోజుకు 2-3 సార్లు పెదవులపై రాయండి. దీంతో పెదవుల నొప్పి నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.
  •  తేనెలో యాంటిసెప్టిక్‌, యాంటీబయాటిక్‌, విటమిన్‌ బి 1, విటమిన్‌ బి 6 కూడా సమృద్ధిగా ఉంటాయి. పగిలిన పెదవులకు తేనెతో మర్దన చేయడం వల్ల మంట, నొప్పి వెంటనే తగ్గుతుంది.
  •  వెన్నలో ఉండే మంచి కొవ్వు పదార్థాలు శరీర గాయాలకు వెంటనే ఉపశమనం కలిగిస్తాయి. ఇందులోని అరాచిడోనిక్‌ యాసిడ్‌ పెదాలపై పగుళ్లను ఐదు, ఆరు గంటల్లో తగ్గిస్తాయి. పడుకునే ముందు వెన్న రాసుకుంటే ఉదయాకల్లా పగుళ్లు ఉండవు.
  •  కలబంద గుజ్జు రాసినా మంచి ఫలితం ఉంటుంది. రాత్రి పడుకునే ముందు పెదాలకు రాసి పడుకుంటే ఉదయం వరకు పెదాలకు కావాల్సిన తేమ అందుతుంది.
  •  కొన్ని దానిమ్మ గింజలను తీసుకొని జ్యూస్‌ తీయాలి. ఆ జ్యూస్‌ను ఫ్రిజ్‌లో నిల్వ చేసుకోవాలి. రోజూ కొద్ది మొత్తంలో ఆ జ్యూస్‌ను తీసుకొని అందులో కాటన్‌ బాల్స్‌ ముంచి వాటితో పెదాలపై సున్నితంగా మర్దన చేయడం వల్ల పగుళ్లు ఏర్పడకుండా ఉంటాయి.
  •  చలికాలం ఎక్కువగా దాహం వేయదు. కానీ శరీరానికి కావాల్సినంత నీరు అందించాలి. ప్రతి గంటకు ఓ గ్లాసు నీరు తాగడం మంచిది. అప్పుడు పెదవులు, శరీరం పగలకుండా ఉంటాయి.