Nov 15,2022 13:37
  • మూడున్నరేళ్లుగా ముందుకుసాగని నెల్లూరు రైల్వే స్టేషన్‌ ఆధునికీకరణ పనులు
  • విశాఖ రైల్వే స్టేషన్‌ ఆధునికీరణ పనులకు ప్రధాని శంకుస్థాపనతో మళ్లీ ఇప్పుడు చర్చనీయాంశం

ప్రజాశక్తి - నెల్లూరు ప్రతినిధి : బిజెపి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను నిలువునా మోసం చేస్తోంది. హామీలు ఇవ్వడమే తప్ప, అమలు చేయడం లేదు. రాష్ట్రంలోని నెల్లూరు రైల్వే స్టేషన్‌ను అంతర్జాతీయ ప్రమాణాలతో ఆధునికీకరించనున్నట్టు కేంద్రప్రభుత్వం ప్రకటించింది. దేశంలోనే తొలి మోడ్రన్‌ రైల్వే స్టేషన్‌గా రూ.147 కోట్లతో నిర్మించడానికి 2019 ఫిబ్రవరి 21న అప్పటి ఉప రాష్ట్రపతి వెంకయయ్యనాయుడు, రైల్వే శాఖ మంత్రి పియూష్‌ గోయల్‌ శంకుస్థాపన చేశారు. 21 నెలల్లోనే ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పారు. ఇప్పటి వరకు తట్టమట్టి కూడా తీయలేదు. కేవలం శిలాఫలకం మాత్రమే మిగిలింది. తాజాగా విశాఖపట్నం రైల్వే స్టేషన్‌ ఆధునికీకరణకు ప్రధాని నరేంద్ర మోడీ శనివారం శంకుస్థాపన చేసిన నేపథ్యంలో నెల్లూరు రైల్వే స్టేషన్‌ ఆధునికీకరణ విషయం కూడా మళ్లీ ఇప్పుడు చర్చనీయాంశంగా మరింది. నెల్లూరు పనులను ఎన్‌బిసిసికి అప్పట్లో అప్పగించారు. 69 వేల స్కోయర్‌ పీట్‌లో స్టేషన్‌, రెండు లక్షల స్కోయర్‌ పీట్‌లో కమర్షియల్‌ ఏరియాను అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. రైల్వేస్టేషన్‌కు త్రీ ప్లస్‌ (జి ప్లస్‌2) కింద, కమర్షియల్‌ బిల్టింగ్‌ను ఎనిమిది లెవల్స్‌ (జిప్లస్‌7)తో అభివృద్ధి చేయాల్సి ఉంది. రెండంతస్తులు బేస్‌మెంట్‌ నిర్మించాలి. పబ్లిక్‌ అడ్రస్‌ సిస్టమ్‌, రోడ్డు, పార్కింగ్‌, సోలార్‌ పవర్‌ ఎనర్జీ, కేఫ్స్‌, ఇన్ఫర్మేషన్‌ సెంటర్‌, సబ్‌వే, రోప్‌వే, లిఫ్ట్‌, ఎక్స్‌లేటర్‌, కమర్షియల్‌ షాపులు, ఫుడ్‌ కోర్టులు, మాల్స్‌ నిర్మాణం చేపట్టాల్సి ఉంది. ఇందుకు సంబంధించిన ఊహా చిత్రాలను రైల్వే శాఖ గతంలోనే విడుదల చేసింది. అయితే, రైల్వే స్టేషన్‌ ఆధునికీకరణకు ఇప్పటి వరకూ ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. ప్రతి రోజు నెల్లూరు స్టేషన్‌ మీదుగా 140 రైళ్లు వెళ్తున్నాయి. ఇందులో ఆరు ప్యాసింజర్‌ రైళ్లు ఉన్నాయి. ప్రతి రోజూ 25 వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. మూడేళ్లు గడిచినా నెల్లూరు రైల్వేస్టేషన్‌ ఆధునికీకరణ ప్రచారానికే పరిమితమైంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ శనివారం విశాఖపట్నం రైల్వేస్టేషన్‌ ఆధునీకరణకు రూ.460 కోట్లతో శంకుస్థాపన చేశారు. నెల్లూరులో మాదిరిగానే ప్రకటనకే పరిమితం అవుతుందా? ఆచరణ రూపం దాల్చుతుందా? అనేది వేచి చూడాలి.
 

                                                                విమానాశ్రయంపైనా దోబూచులాట...

నెల్లూరు జిల్లా అంత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంది. కృష్ణపట్నం పోర్టు నిర్మాణంతోపాటు థర్మల్‌ ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో విమానాశ్రయ ఏర్పాటు కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దోబూచులాడుతున్నాయి. తొలుత దామవరం వద్ద విమానాశ్రయం ఏర్పాటు చేస్తామని చెప్పి, ఇప్పుడు రామాయపట్నం పోర్టు సమీపానికి దీన్ని మార్పు చేశారు.