ఐదేళ్లు అంటే అప్పుడప్పుడే పరిసరాలు అవగాహనలోకి వచ్చే వయసు.. ఆ తరుణంలో బరువులు ఎత్తడం ప్రారంభించింది అర్షియా గోస్వామి. పోటీ ప్రపంచం అంటే ఏంటో కూడా తెలియని పసి వయస్సు. అలాంటిది... ఏకంగా 20, 30, 40, 45 కిలోల బరువులు ఎత్తుతుంటే చుట్టూ ఉన్న జనమే కాదు; ప్రపంచం అంతా ఆశ్చర్యంగా చూసింది. ఆరేళ్ల వయసులోనే 46 కేజీల బరువును ఎత్తి, క్రీడా ప్రపంచం ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు ఏకంగా 60 కిలోలు బరువు ఎత్తి అతి పిన్న వయస్కురాలైన డెడ్‌లిఫ్టర్‌గా ఖ్యాతి తెచ్చుకుంది.
అమ్మాయిలు ఎక్కువ బరువులు మోయలేరు. సుకుమారులు. పెళ్లి అయితే ఈ ఆటలు ఏమీ ఆడరు.. వంటి మూస అభిప్రాయాలు అమ్మాయిలను వెనక్కులాగుతాయి. కానీ, అర్షియా సాహసాన్ని, శక్తినీ చూస్తే ఆ అపోహలు పటాపంచలవుతాయి. హర్యానాలోని పంచకుల ప్రాంతానికి చెందిన అర్షియా 2015 జనవరి 1న జన్మించింది. తండ్రి అవ్నీష్ గోస్వామి ఆమెకు ఐదేళ్ల వయస్సు నుంచే వెయిట్ లిఫ్టింగ్‌లో శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు. పవర్‌లిఫ్టింగ్ చేస్తూనే ఒక సంవత్సరం తర్వాత టైక్వాండోలో తన ప్రయాణాన్ని ప్రారంభించింది. వెయిట్ లిఫ్టింగ్ కోసం ఆమె చేసే కష్టం అంతా ఇంతా కాదు. యుక్త వయసు వారు చేసే సాధనను ఆమె ఆ చిన్న వయస్సులోనే చేసింది. అయితే మొదట్లో ఎవరూ ఊహించలేదు. ఆమె పెద్ద పెద్ద బరువు ఎత్తగలదని. శిక్షణ తీసుకున్న ఆరు నెలలకే రాష్ట్ర స్థాయి వెయిట్ లిఫ్టింగ్ టోర్నమెంట్‌లో మూడో స్థానం దక్కించుకుంది. టోర్నమెంట్‌కి, మరో టోర్నమెంట్‌కి మధ్య ఆమె బరువుల సంఖ్య పెంచాలన్న పట్టుదల బలంగా ఉండేది. ఎన్నో బంగారు పతకాలను సాధించింది. ఆమె అసాధారణ ప్రదర్శన ప్రేక్షకులను, నిపుణులను సైతం ఆశ్చర్యపరిచింది.
అర్షియా అంత బలంగా తయారుకావడానికి రహస్యం ఆమె ఇంట్లో వండిన ఆరోగ్యకరమైన ఆహారాన్ని మాత్రమే తింటుంది. ఆ వయస్సులో చాక్లెట్ తినాలని ఎవరికైనా ఉంటుంది. కానీ, తను చాక్లెట్ రుచి చూడలేదు. అంత కఠినంగా శిక్షణ తీసుకుంది. ఆరేళ్ల వయస్సులో, 2021లో 46 కిలోల బరువును ఎత్తిన అతి పిన్న వయస్కురాలు డెడ్‌లిఫ్ట్‌గా రికార్డు సృష్టించింది. ఈ సంఘటనే ఆమె బంగారు జీవితానికి దారివేసింది. ఆమెకు ప్రపంచ వ్యాప్తంగా అభినందనలు వచ్చాయి. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఆమె సాధించిన విజయాన్ని గుర్తించింది. ఇప్పుుడు అర్షియాకు ఎనిమిదేళ్లు వచ్చాయి. బరువు కూడా అదే స్థాయిలో పెంచింది. 60 కిలోలు ఎత్తి ప్రతిభకు వయస్సుతో సంబంధం లేదని నిరూపించింది.
ఆమె చేస్తున్న కసరత్తులు, వెయిట్ లిఫ్టింగ్‌లను ఆమె తండ్రి వీడియోలు తీసి సోషల్‌మీడియాలో ఉంచగా కోట్లల్లో వ్యూస్ వచ్చాయి. లక్షల మంది ఫాలోవర్స్‌గా మారారు. అర్షియా అంకిత భావానికి హ్యాట్సాఫ్ అంటూ అభినందనలు కురిపిస్తున్నారు. అర్షియా తన వయసు పిల్లలకే కాదు.. తోటి క్రీడాకారులకు, పెద్దలకు కూడా స్ఫూర్తిదాయకం.










