ఎండుటాకుల మధ్య నుంచి పాకుతూ, నాగుపాము దూరమౌతున్న దృశ్యాన్ని ఎప్పుడైనా చూశారా? అప్పుడు పొందిన అనుభూతే ఈ కత్తి పద్మ కథలు 'చీకటి పువ్వు' చదివితే పొందుతాం. అవే గలగలలు, అదే ఆశ్చర్యం, ఒకొక్క కథా పూర్తయినంత వరకూ, నాగు కనుచూపు దాటినంతవరకూ నిశ్చేష్టంగా అదే దృష్టి. ఈ కథల్లో అబలలందరూ బహుజనులే ! బహుజన మహిళలే ఈ సమాజంలో అసలైన శ్రామికులు. ఆహారాన్ని, అభివృద్ధిని వారే ఈ సమాజానికి హెచ్చుగా అందిస్తున్నారు. కళింగాంధ్రలో వైదికం ఎంత ప్రవేశించినా నేటికీ 95 శాతం బహుజనులే ఉంటారు. తూర్పు కాపులు, గొల్లలు, వెలమలు, కాళింగులూ, దళితులు, మత్స్యకారులూ, గిరిజనులూ ఇలా! ఒక కోమటి ఒక కాపు స్త్రీని, ఒక ఆచారి ఒక బ్రాహ్మణ మహిళ జీవితాన్ని నాశనం చేయడం తప్ప అగ్రవర్ణాలనుకొన్నవారు ఈ కథల్లో కనిపించరు. 'గురజాడ, కందుకూరి, శ్రీపాద బ్రాహ్మణ కులంలోని బాధలే రాశారు' అన్న వాక్యానికి అపవాదు ఈ కథలు. కాలం మారింది కదా !
తిరుగుబోతు మొగుళ్ళతో బాధలు పడ్డ స్త్రీలు, తాగుబోతు మగాళ్ళు చనిపోగా విధవలైనవారు, మొగుళ్ళు ఒదిలేస్తే ఒంటరైన మహిళలు, పురుషుల చేతిలో మోసగింపబడ్డ అబలలు ఇలా ఈగ్రంథం నిండా వీరే! కళింగాంధ్రలోని సమాజ బాధిత మహిళలే కనిపిస్తారు. ఈవిడ మామూలు కథకులు రాసినట్టుగా కథను ముగించరు. చిత్రకారుడు ప్రకృతిని చిత్రించి, పేరు మనల్నే పెట్టమన్నట్టు ముగింపు పాఠకుడికే వదిలేస్తారు. కథను మాత్రం ఏ కథకుడూ రాయలేనంత సహజంగా చెబుతారు. అడవి మధ్యగా వంపులు తిరుగుతూ ప్రవహిస్తున్న నది అడవి దట్టమైనచోట కనిపించకుండా పోతుంది. అది వేరే నదిలో లీనమయిందా? అక్కడే ఇంకి పోయిందా? ఇంకా పారుతుందా? సముద్రంలో కలిసి పోయిందా? పాఠకుడే అంచనా వేసుకోవాలి. ఈ కథల్లో ముగింపు కోసం వెతికితే నిరాశే! కాని ఆ రాసే విధానంలోని తెగింపు మాత్రం ఆశ్చర్యం.
'మనాడోల్లకి పెల్లిల్లు అచ్చిరావర్రా' అంటూ బిగ్గరగా ఏడుస్తుంది ఆదిలక్ష్మి 'మనకీ పెళ్ళిళ్ళు అచ్చిరావు' అనే కథ ముగింపులో. ఐతే ఈ కథలన్నింటిలో అన్ని పెళ్ళిళ్లూ పెద్దలు కుదిర్చినవే! ఏ సంసారమూ చివరంటా సజావుగా నడవదు. ఏ స్త్రీ జీవితం కూడా సంతోషంగా గడవదు. తల్లులే, ఇంట్లోని వారే అమ్మాయి ఇష్టాన్ని తెలుసుకోకుండా, డబ్బో, ఉద్యోగమో ఉందని తమకు నచ్చినవాడికిచ్చి చేసెయ్యడం, ఆ సంసారం పెటాకులైపోవడం, మగాడు వేరే స్త్రీని పెళ్ళాడ్డం, ఆడది సమాజానికి బలికావడం జరుగుతుంది. 'సమరమే!' అనే కథ ముగింపులో 'యుద్ధం తప్పనప్పుడు తలపడాల్సిందే! జీతం కోసమో, జీవితం కోసమో తెగించాల్సిందే! మళ్ళీ మళ్ళీ తెగించాల్సిందే! ... ఇలా బాధితురాలు పంతులమ్మచే అనిపిస్తారు.
ఇందులోని 19 కథల్లో బతుకు మీద యుద్ధంలో వీరమరణం పొందిన 'ఎర్రెమ్మ'లు పల్లెల్లో అక్కడక్కడా కనిపిస్తారు. పట్నం జనాలకు ఆమె ఓ వింత పాత్ర. ఛాత్రిబాబు (రావి శాస్త్రి) తన దగ్గరకు క్లౖెెంట్లుగా వచ్చిన పేదల్లో కొందరు మహిళల జీవితాలను కథలుగా, నవలలుగా మలిచారు. కత్తి పద్మ నాల్గు దశాబ్దాలపాటు మహిళా ఉద్యమ కార్యకర్తగా తానే ఆయా పల్లెలకు పోయి, ప్రత్యక్షంగా చూచి, విని, బాధిత మహిళల జీవితాలను చలనచిత్రంలా రూపు కట్టించారు.
ఉత్తరాంధ యాస ఈ పద్మ పట్టుకున్నంతగా ఇంకొక రచయిత పట్టుకోలేదంటే అతిశయోక్తి కాదు. పేరాలు పేరాలు, పేజీలు పేజీలు విశాఖపట్ణం యాస అతి సహజంగా ప్రవహిస్తుంటుంది. ఈమె సమాజపు లోతుల్లోకి నడిచారు. మనల్ని నడిపిస్తారు ఈ కథల్లో. లోతులకు దిగితేనే ఏదైనా అంటుతుంది. 'నీగీదల్ని నీ ఇంట్లోనే ఉంచీసుకోయే. ఆటుచ్చా పేడా నీకే ఉండిపోతాయి. ఈదుల్లో ఒదలకే. నీగీద పేడని తెలిత్తే నా కోడలు దాని మొకవే సూడకపోను. పేడమీద గేదెల పేర్లూ లేవూ, నీ పేరూ నేదు. మరి అది ఎవలి పేడో ఎవులికి తెలుత్తాది. నువ్వు మనసులో ఏదో ఎట్టుకొని ఇలగ పేడమీద పేరెట్టి గొడవకి దిగినావని నాకు తెల్సుగానీ ఇంక ఎక్కువ పేలక. నా ఈదిలో పడిన పేడని మావు తీసి కుసింత కల్లాపి జల్లుకున్నాం. రాయే, వచ్చి మా వాకిలి నాకీసి పేడొట్టుకు పోయే.' ఈ రకంగా నూకాలమ్మను వరహాలమ్మ చేత ఒక దులుపు దులిపిస్తుంది కత్తి. 'మా ఇసాపట్నం కొండ' కథలోది ఈ సన్నివేశం. ఈ కథలో వరహాలమ్మ మొగుడు సత్తిరాజు పోర్టులో ఉద్యోగి. జీతమంతా తాగుడికే ఖర్చు చేస్తుంటాడు. తన వైవాహిక జీవితంలో ఏ రకమైన సుఖానికీ నోచుకోని వరాలమ్మ మొగుణ్ని వీథిలోకి గెంటేసి, పిల్లల్ని తానే పెంచి, గేదెలూ, కోళ్ళూ, కుక్కలే ఆప్తులుగా బతుకుతుంది.
ఇందులోని 19 కథల్లో మందుతాగి బలాదూరుగా తిరిగే మగవాళ్ళు మహిళలను ఆటవస్తువులగా వాడుకొని వదిలేయడం చూస్తాం. సమాజంలో మందు ఎంత బలంగా వేళ్ళూనుకుందో, స్త్రీల జీవితాలను ఎలా ఛిద్రం చేస్తోందో వీటిలో స్పష్టపడుతుంది. అన్నీ ఈ కర్మభూమి మీద నడయాడే ఆడదాని కథలే! రక్తమాంసాలు కలిగిన స్త్రీలు మన కళ్ళెదుటే తిరుగుతుంటారు. క్షోభలు, కన్నీళ్ళు, బండబారిపోడాలు, తెగింపులు ఒకటేమిటి? తరతరాలుగా సమాజం చేత తొక్కబడి, సమాజం అడుగు పొరలో మగ్గుతున్న అబలలే తారసపడతారు. 'దారులు మూసుకు పోవాల' కథంతా పూర్తయి, చివరి మూడు లైన్లు చదవగానే ఒకందుకు నవ్వొస్తుంది.
చీకటిపువ్వుగా బతికి విషాదాంతమైన కాంతది కథ కాదు. 50 ఏళ్ళ కిందటి కొందరి పేదింటి ఆడపిల్లల చరిత్ర. తన ప్రమేయం లేకుండానే తన శరీరం అంగడి వస్తువైన అబల వ్యథ ఇది. అంగడి సరుకై బండబారి కూడా ఒక మగాడిని ఇష్టపడి, వాడికి జీవితాన్ని అర్పించిన కథే 'చీకటిపువ్వు'. మండే ఎడారిలోనూ ఒయాసిస్సు ఉంటుంది కదా! ఇందులో కాంత మనసూ అలాంటిదే! ముఖపత్రంపై చీకటిపువ్వును మోషే దయాన్ అత్యంత ప్రతిభావంతంగా వేశారు. పువ్వు ఏ తుమ్మెదకు తన మకరందాన్ని ఇష్టపూర్వకంగా అందిస్తుందో, ఏ తుమ్మెదను చూచి ముడుచుకు పోతుందో, చీదరించుకుంటుందో పూబోడులకే ఎఱుక. అందుచేతనే ఈ కథలను ఇంత ఆర్ద్రంగా కత్తి పద్మ రాయగలిగారు. మగవారికి అసాధ్యమైన రచన ఇది. వారు రాసినా కథలు కొంచం అటు ఇటు అవుతాయే తప్ప ఇంత స్వాభావికంగా రాయలేరు. 308 పుటల 'చీకటి పువ్వు' అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలలోనూ రూ.250 లకు దొరుకుతుంది.
- గార రంగనాథం
98857 58123










