Aug 21,2023 07:36

అద్దంలో కొండ అబద్ధం!
కనీనికలో ప్రతిబింబించే మహాసముద్రం అబద్ధం!
తూర్పు పడమరల అంచుల్ని తాకే ఇంద్రధనస్సు అబద్ధం!
పాలల్లో ప్రవాసం చేసిన
నీళ్ల రంగు అబద్ధం

సిరిగల తల్లికి స్వాగతం పలికే
రొయ్యల చెరువుల్లో కంకులు వేసే వరి అబద్ధం
అనుమానం లేదు
నేతి బీరలో నెయ్యి లాగే
అన్నపూర్ణలో అన్నం అబద్ధం
బీట పొలాల్లో
పచ్చని పైరు పంట అబద్ధం
నెమలికన్నుకి చూపు రావటం అబద్ధం
పెట్రో రాక్షసి నోరు తెరవటం అబద్ధమైతే
వంటింట్లో అత్తింటి కోడళ్ళ జీవితానికి బీమా అబద్ధం
కురుక్షేత్రంలో జీవహింస అబద్ధం
ఆశను అడవిపాలు చేసి
శ్వాసను సగంలో తుంచేసి
ఎవరో వస్తారని ఏదో చేస్తారని
చేసుకున్న ఆత్మహత్యలో నిజం అబద్ధం
మంత్రాలకి చింతకాయల వర్షం అబద్ధం
హత్య నిజం .... రక్తం నిజం
ప్రాణంలేని పార్ధిశంకర నిజం
స్వాహామంత్రం సిద్ధించిన స్వాములు
ఆధర వేదాలపై వర్ధిల్లే శాంతి వచనం అబద్ధం
కలలతో తెల్లారే రాత్రి నిజాయితీలో
అడవికి ఆస్తిపరులకి మధ్య
గురిపెట్టిన తుపాకీ కొసమీద
పావురాయి కాపురం అబద్ధం
సింహం శాకాహార వ్రతం అబద్ధం
మనిషి మనిషీ మతాల యాసలో
ఊరు ఊరు బాంబుల భాషలో పలకరించుకొనే
ఎడారి చీకటి బాటలో రైతుల కన్నీటి నధులు
జాతీయ అనుసంధానం అబద్ధం
జలజల పారే ఆనందాల అలలు అబద్ధం
విమర్శల సానరాయి పైన
అణువణువు అరిగరిగీ
అదృశ్యమైపోయిన మానవత్వం
తల పైన ప్రమాణం చేసి నిజం చెప్తున్నా పార్టీలు ఎన్ని మారినా
ప్రభుత్వాలు ఎన్ని తరించినా
పేదవాడి వేళ్ళు ఐదూ
పెదవల దాకా చేరటం పచ్చి అబద్ధం
నిశ్చింతే నిదురై పోయే రాత్రి అబద్ధం!
 

- ఈతకోట సుబ్బారావు
94405 29785