Sep 14,2023 07:45

ట్రిపోలీ : లిబియాలో భారీ వర్షాలు, వరదలు సృష్టించిన బీభత్సంలో 5,300 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో పది వేల మందికి పైగా ప్రజల ఆచూకీ తెలియడం లేదు. వర్షాల కారణంగా రెండు ఆనకట్టలు కూలిపోయాయి. తూర్పు ప్రాంతంలోని డెర్నా నగరం నీట మునిగింది. అల్‌మర్జ్‌, సుసాహ్, షాహత్‌, అల్‌ బేడా నగరాలలో కూడా భారీగా ప్రాణనష్టం జరిగింది. ఇరవై వేల మందికి పైగా ప్రజలు సర్వం కోల్పోయి నిరాశ్రయులయ్యారు. సుమారు 90 వేల జనాభా కలిగిన డెర్నా నగరానికి దారితీసే రహదారులన్నీ వరదల కారణంగా దెబ్బతినడంతో సహాయ బృందాలు చేరుకోవడం కష్టమవుతోంది. రాజకీయ విభజనల కారణంగా 2014లో లిబియా రెండుగా చీలిపోయింది. అంతర్జాతీయ గుర్తింపు పొందిన ప్రభుత్వం ట్రిపోలీలో ఉండగా, డెర్నా సహా తూర్పు ప్రాంతం మరో అధికార వ్యవస్థ అధీనంలో ఉంది. దీంతో ఆ ప్రాంతంలో మౌలిక వసతులు సరిగా లేవు. ఆర్థిక అసమానతలు, పర్యావరణ అసమతుల్యతతో ఆ ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.