ప్రజాశక్తి-తోటపల్లిగూడూరు (నెల్లూరు జిల్లా) :ఎంతో కాలంగా వెట్టి చాకిరీలో మగ్గిపోతున్న ఓ గిరిజన కుటుంబానికి ఎట్టకేలకు విముక్తి లభించింది. ఈ ఘటనపై చొరవ చూపిన పోలీసులపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. నెల్లూరు జిల్లా తోటపల్లిగూడూరు మండలంలోని మల్లికార్జునపురం ఎస్‌టి కాలనీకి చెందిన ఎల్లసిరి మణి తన భార్య మాధవి, ఇద్దరు కుమారులు చైతన్య, రమణలతో కలిసి ఐదేళ్ల కిందట కడప జిల్లా రాయచోటి ప్రాంతంలో ఇటుక బట్టి యజమాని జి.మోహన్‌బాబు నాయుడు వద్ద సిమెంట్ తయారీ పనికి వలస వెళ్లారు. అప్పటి నుంచి మణి ఆయన భార్య మాధవి కుమారులు చైతన్య, రమణతో యజమాని బలవంతంగా వెట్టి చాకిరి చేయిస్తున్నాడు. ఆచాకిరి చేయలేక ఆ పేద గిరిజన కుటుంబం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ వచ్చింది. ఆ కుటుంబం రూ. 3 లక్షలు బాకీ చెల్లించాల్సి ఉందని, అది చెల్లించే వరకు పోవడానికి వీల్లేదని వారిని నిర్బంధించాడు. ఈ నేపథ్యంలో మణి ఆరోగ్యం క్షీణించింది. కడుపునొప్పి, అధిక జ్వరం వల్ల ఫిట్స్ వచ్చింది. అయినా ఆయనను ఆస్పత్రికి కూడా తీసుకుపోకుండా నిర్బంధించాడు. దాంతో భార్య, బిడ్డలు తీవ్ర భయాందోళనకు లోనయ్యారు. ఇటుకబట్టీ యజమాని మణి కుటుంబానికి పెడుతున్న చిత్ర హింసల గురించి తెలుసుకున్న ఎపి యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, నెల్లూరు జిల్లా అధ్యక్షులు డిఎల్ శేఖర్ తమ సంఘం ప్రతినిధులతో కలిసి విషయాన్ని ఎస్‌పి విజయరావు దృష్టికి తీసుకెళ్లారు. ఎస్‌పి ఆదేశాల మేరకు తోటపల్లిగూడూరు సిఐ వేమారెడ్డి, ఎస్‌ఐ కె.ఇంద్రసేనారెడ్డి తన సిబ్బందితో కలిసి రాయచోటికి వెళ్లారు. ఇటుక బట్టి యజమాని మోహన్‌బాబు నాయుడు నిర్భంధంలో ఉన్న మణి ఆయన భార్య, బిడ్డలను విడిపించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. వెట్టి చాకిరి నుంచి తమకు విముక్తి కలిగించిన పోలీసులకు, గిరిజన సంఘం నాయకులకు మణి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.










