విశాఖలో ఘనంగా గిడుగు రామ్మూర్తి జయంతి సభ
ప్రజాశక్తి- ఎంవిపి.కాలనీ (విశాఖపట్నం) :తెలుగు భాషాభివృద్ధికి గిడుగు రామ్మూర్తి నాడు పాటుపడ్డట్టు, నేడు ప్రతి ఒక్కరూ కంకణధారులై మాతృభాష మనుగడకు నడుం బిగించాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. తెలుగు వాడుక భాషోద్యమ పితామహుడు గిడుగు రామ్మూర్తి 160వ జయంతి వేడుకలు సాహితీ స్రవంతి, అరసం, అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రం సంయుక్తాధ్వర్యంలో విశాఖలోని అల్లూరి విజ్ఞాన కేంద్రంలో మంగళవారం ఘనంగా జరిగాయి. సాహితీ స్రవంతి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎంవిఎస్.శర్మ అధ్యక్షతన మేడా మస్తాన్‌రెడ్డి సారథ్యంలో జరిగిన ఈ సభలో ప్రముఖ తెలుగు భాషా కోవిదులు మీగడ రామలింగస్వామి మాట్లాడుతూ అన్య పదజాలం మనభాషలో విరివిగా ప్రవేశించినప్పుడు భాష మృతభాషగా మారుతుందని, అప్పుడు మన సంస్కృతి ఆనవాళ్లను కూడా కోల్పోతామని అన్నారు. అందుకే ప్రతి ఒక్కరూ బాధ్యతగా తెలుగు భాష కోసం పరితపించాలని కోరారు. అవధాన ప్రక్రియ మనకే సొంతమని, అటువంటి తెలుగు సాహిత్య ప్రక్రియలకు ఆధునికతను మేళవించి భాషను రక్తి కట్టించాలని అన్నారు. అనంతరం పలువురు మాట్లాడుతూ గిడుగు, గురజాడ తెలుగు భాషను ఉన్నత స్థానానికి తీసుకెళ్లారని వివరించారు. తరతరాలుగా తెలుగు వారి ఆత్మ గౌరవానికి ప్రతీకగా తెలుగు భాష నిలుస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో సాహితీవేత్తలు, రచయితలు, నగర ప్రముఖులు కెజి.వేణు, అడపా రామకృష్ణ, క్షేత్రపాల్ రెడ్డి, వేల్పురి నాగు, కెఎస్‌వి.రమణమ్మ, శేఖరమంత్రి ప్రభాకర్, పి.శ్యాంసుందర్, డాక్టర్ కెవిఎస్.మూర్తి, డాక్టర్ ఎం.సుబ్బారావు, జాలాది విజయ, వేణు, అప్పలరాజు, వై.దయానంద్, పి.నల్లనయ్య, అల్లూరి విజ్ఞాన కేంద్రం కార్యక్రమాల ఇన్‌ఛార్జి జిఎస్.రాజేశ్వరరావు, సాహితీ స్రవంతి జిల్లా కార్యదర్శి పెంటకోట రామారావు, అరసం బాధ్యులు ఉప్పల అప్పలరాజు పాల్గన్నారు. మస్తాన్ రెడ్డి బృందం ప్రదర్శించిన నాటకం అందరినీ ఆకట్టుకుంది.