Aug 22,2023 21:56
  •  అధికార భాషా సంఘం అధ్యక్షులు విజయబాబు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : తెలుగు వాడుక భాషా ఉద్యమ పితామహుడు గిడుగు వెంకట రామ్మూర్తి 160వ జయంతి సందర్భంగా ఈ నెల 23 నుంచి 29 వరకు వారం రోజులపాటు తెలుగు భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర తెలుగు అధికార భాషా సంఘం, తెలుగు భాషాభివృద్ధి ప్రాధికార సంస్థ అధ్యక్షులు పి విజయబాబు తెలిపారు. అమరావతి సచివాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ద్విభాషా విధానాన్ని ప్రోత్సహించేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటోందని అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వారం రోజులపాటు తెలుగు భాషా దినోత్సవాన్ని జరపనున్నట్లు తెలిపారు. ఈ వారోత్సవాలను అన్ని జిల్లాల కేంద్రాలతోపాటు రాష్ట్ర స్థాయిలో ప్రధానంగా గుంటూరు, విజయవాడ కేంద్రాల్లో ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ వారోత్సవాల్లో భాగంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులకు, రాష్ట్ర సచివాలయంలోని ఉద్యోగులకు కథలు, కవితలు, అంత్యాక్షరీ పోటీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అలాగే సాహితీ వేత్తలను, భాషా సేవకులను, భాషా వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్న వారిని ఈ సందర్భంగా సత్కరిస్తామని అన్నారు. తెలుగు భాషా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా రాష్ట్ర స్థాయిలో ఈ నెల 23న ఉదయం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఈ వారోత్సవాలు ప్రారంభమై ఈ నెల 29న సాయంత్రం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించే కార్యక్రమంతో ముగుస్తాయన్నారు. ఈ నెల 24న ఉదయం విజయవాడ ఎస్‌ఆర్‌ఆర్‌ డిగ్రీ కళాశాలలో, 25న ఉదయం ఆంధ్ర లాయోల డిగ్రీ కళాశాలలో, 26న ఉదయం బెజవాడ బార్‌ అసోసియేషన్‌ కార్యాలయంలో, సాయంత్రం గుంటూరులోని వెంకటేశ్వర విజ్ఞాన్‌ మందిరంలో, 27న సాయంత్రం విజయవాడలోని ఘంటసాల సంగీత విశ్వవిద్యాలయంలో, 28న అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో పలు కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ వారోత్సవాల్లో రాష్ట్ర ప్రజలు పెద్దయెత్తున భాగస్వామ్యం కావాలని కోరారు.