Aug 07,2023 20:38

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : కాంగ్రెస్‌ పార్టీతోనే మహిళాభ్యుదయం సాకారమవుతుందని, చట్ట సభల్లో 33 శాతం మహిళలకు రిజర్వేషన్‌ కల్పించడం ద్వారానే వారికి పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతుందని పిసిసి రాష్ట్ర అధ్యక్షులు గిడుగు రుద్రరాజు అన్నారు. విజయవాడ ఆంధ్రరత్న భవన్‌లో రాష్ట్ర మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షులుగా తాంతియా కుమారి ప్రమాణ స్వీకార కార్యక్రమం సోమవారం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సభకు గిడుగు రుద్రరాజు అధ్యక్షత వహించారు. తాంతియాతో కాంగ్రెస్‌ పార్టీ మహిళా విభాగం మరింత బలపడుతుందన్నారు. తాంతియా కుమారి మాట్లాడుతూ.. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, ఉదయం స్కూలుకు వెళ్లిన పిల్లలు సాయంత్రం ఇంటికి రావడం కూడా కష్టంగా మారిందని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ జాతీయ మహిళా అధ్యక్షులు నెట్టా డిసౌజా మాట్లాడుతూ.. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కాంగ్రెస్‌లో ఉంటూ మహిళాభ్యున్నతికి ఎంతో కృషి చేశారన్నారు. ఈ కార్యక్రమంలో కార్యనిర్వాహక అధ్యక్షులు మస్తాన్‌వలి, జంగా గౌతమ్‌, కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యే సత్యవతి తదితరులు పాల్గొన్నారు.