Dec 12,2022 08:22

భూమి పొరల్లో పూడుకుపోయిన
ఆస్తి పంజరాల కథలు వినాలంటావా
చెవులు కాదు చదివే మనసు కావాలి !
ఆకాశం శూన్య శరీరం మీద
మచ్చల చరిత్ర మహాగ్రంథం రాయాలంటావా
చేతులు కాదు రాసే అక్షరాలు కావాలి !

చీకటి సముద్రాన్నెంత తోడి పోసినా
చీకటి మిగులుతుంది చివరికి
అజ్ఞానం గుట్టలుగా పోసినట్టు
గతం వర్తమానం భవిష్యత్తూ
త్రిముఖ కోణాలై చీకటి కళ్ళు తెరుస్తాయి
నీకు నీవే కాదు
ఎదుటి వాడు కూడా చీకటి గుడారమే
జటా ఝులిత నత్యాంగనైన చీకటి రాక్షసిని
ఒక్క కిరణంతో చంపగలగాలి
దీపం వెలిగించు జ్ఞానంతో
చీకటి పాలపుంతై పోతుంది
అనుభవాల యిరుసుమోసే చక్రాలు రెండూ
భూత భవిష్యత్తులై పోతాయి

మనసు ప్రపంచ చరిత్రను చదువుతూ
పంచభూతాల్లో అస్తిత్వాన్ని రచిస్తోంది
బతుకు పడవకి చుక్కాని చదువు
రేపటి కోసం నీ జ్ఞాపకాల సూర్యుణ్ణి
భూమ్మీదకు విసిరెరు
కొత్త ఆశలకి అంటుకడతారు జనం !

- ఈతకోట సుబ్బారావు
94405 29785