Oct 30,2023 10:54
  • మోడీ ప్రభుత్వ తీరుపై విమర్శలు

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : సామ్రాజ్యవాద శక్తుల అండతో ఇజ్రాయిల్‌ గాజాపై సాగిస్తున్న క్రూరమైన దాడులకు వ్యతిరేకంగా, గాజా, వెస్ట్‌ బ్యాంక్‌ ప్రజలకు సంఘీభావంగా సిపిఎం భారీ ధర్నా నిర్వహించింది. ఆదివారం నాడిక్కడి ఎకెజి భవన్‌ వద్ద సిపిఐ (ఎం) భారీ ధర్నా నిర్వహించింది. ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీ తీర్మానానికి అనుగుణంగా ఇజ్రాయెల్‌, దాని మిత్రదేశాలు తక్షణమే కాల్పుల విరమణ పాటించాలని ధర్నా నుద్దేశించి ప్రసంగించిన నేతలు డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మాట్లాడుతూ.. పాలస్తీనియన్లు పాశవిక దాడులకు గురవుతున్నారన్నారు. ''దాదాపు ఎనిమిది వేల మంది చనిపోయారు. వీరిలో దాదాపు సగం మంది పిల్లలు, మహిళలు ఉన్నారు. సహాయక చర్యలు నిలిచిపోయాయి. అన్ని కమ్యూనికేషన్లకు అంతరాయం ఏర్పడింది. కూలిన భవనాల శిథిలాల మధ్య ఎంతమంది చిక్కుకుపోయారో చెప్పలేం. ఈ క్రూరమైన దాడిని తక్షణమే ఆపాలి. 1967కి పూర్వపు సరిహద్దులతో, తూర్పు జెరూసలేం రాజధానిగా స్వతంత్ర పాలస్తీనా ఏర్పాటు చేయాలన్న ఐరాస తీర్మానానికి అన్ని పక్షాలు కట్టుబడి ఉండాలని అన్నారు. భద్రతా మండలి తీర్మానానికి భారత్‌ ఇంతకాలం మద్దతు ఇచ్చింది. మోడీ ప్రభుత్వం ఇప్పుడు దీని నుంచి వెనక్కి తగ్గింది.
            అమెరికా మద్దతుతో ఇజ్రాయిల్‌ ఆక్రమణకు వ్యతిరేకంగా ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. లండన్‌లో పాలస్తీనా కోసం నాలుగు లక్షల మంది ర్యాలీ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా వామపక్షాలు నిరసనలకు దిగుతున్నాయి. ఈ నిరసనలో సిపిఐ(ఎం) కేంద్ర నాయకత్వం కూడా భాగం అయింది. రెండు దేశాల ఏర్పాటు పరిష్కారంపై తన స్వంత నిర్ణయాన్ని అమలు చేయడానికి ఐరాస చొరవ చూపాలి. భారత ప్రభుత్వం కూడా దీనికి పూర్తి మద్దతు తెలపాలని ఏచూరి కోరారు.
మోడీ ప్రభుత్వం ఇజ్రాయెల్‌ దురాక్రమణదారులకు నిస్సిగ్గుగా మద్దతు ఇస్తోందని ఆయన విమర్శించారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ మాట్లాడుతూ పాలస్తీనాలో వేలాది మంది చిన్నారులపై ఇజ్రాయెల్‌ చేస్తున్న ఊచకోత సాగించడం దారుణమన్నారు. ఐరాసలో పాలస్తీనా అనుకూల తీర్మానంపై ఓటింగ్‌కు భారత్‌ గైర్హాజరు కావడం విస్మయం కలిగిస్తోందన్నారు.
          పాలస్తీనాలో అమాయకులు చనిపోతున్నారు. మహిళలు, పిల్లలు చంపబడుతున్నారు. ఈ చర్యను తీవ్రంగా వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. ఇజ్రాయెల్‌ దాడుల్లో ఇప్పటివరకు 8,000 మందికి పైగా పాలస్తీనియన్లు మరణించారు. దాదాపు 19,000 మంది గాయపడ్డారు. 14 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. ఒక్క గాజాలోనే 87,000 ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఇజ్రాయెల్‌ దాడితో పూర్తిగా ధ్వంసమైన గాజాలో శాశ్వత కాల్పుల విరమణ పాటించాలని సిపిఐ(ఎం) డిమాండ్‌ చేసింది. ధర్నా నుద్దేశించి మాట్లాడినవారిలో పార్టీ పొలిట్‌ బ్యూరో భ్యులు బృందా కరత్‌, మాణిక్‌ సర్కార్‌, మహమ్మద్‌ సలీమ్‌ తదితరులు ఉన్నారు. బిమన్‌ బసు అధ్యక్షత జరిగిన ఈ ధర్నా కార్యక్రమంలో పొలిట్‌ బ్యూరో సభ్యులు ప్రకాష్‌ కరత్‌, బివి రాఘవులు, సుభాషిణి అలీ, ఎంఎ బేబీ, ఎ. విజయరాఘవన్‌, జి రామకృష్ణన్‌, సూర్యకాంత్‌ మిశ్రా, తపన్‌ సేన్‌, అశోక్‌ దావలే, ఎంవి గోవిందన్‌, కేంద్ర కమిటీ సభ్యులు బిమన్‌ బసు, బి.వెంకట్‌, యూసఫ్‌ తరిగమి తదితరులు పాల్గొన్నారు.