Oct 29,2023 10:02
  • రాష్ట్ర కమిటీ నిర్ణయం తీసుకుంటుంది :  సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో సీట్ల సర్దుబాటు గురించి చర్చలు జరుగుతున్నాయని, దీనిపై పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ నిర్ణయం తీసుకుంటుందని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. సిపిఎం కేంద్ర కమిటీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో శనివారం నాడిక్కడ హరికిషన్‌ సింగ్‌ సూర్జిత్‌ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్షాల ఐక్య వేదిక 'ఇండియా'ను బలోపేతం చేయడం దేశానికి అవసరమని ఏచూరి అన్నారు. దేశ లౌకిక, ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు 'ఇండియా' మరింత బలోపేతం కావాలని, ఇందుకోసం సిపిఎం కృషి చేస్తుందని ఆయన అన్నారు. 'ఇండియా' వేదికలోని అన్ని పార్టీల సీనియర్‌ నేతలతో సంప్రదించి నిర్ణయాలు తీసుకుంటారని, దీనికి సమన్వయ కమిటీలో సభ్యులుగా లేకపోవడం అడ్డంకి కాదని పేర్కొన్నారు. జెడిఎస్‌ కేరళ యూనిట్‌ జాతీయ నాయకత్వానికి పూర్తిగా దూరమైందని, ప్రస్తుతానికి కేరళలో జెడిఎస్‌గా కొనసాగుతున్నదని తెలిపారు. త్రిపుర మాజీ ముఖ్యమంత్రి, సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు మాణిక్‌ సర్కార్‌ అధ్యక్షతన హరికిషన్‌ సింగ్‌ సూర్జిత్‌ భవన్‌లో సిపిఎం కేంద్ర కమిటీ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో జాతీయ రాజకీయ పరిస్థితులతోపాటు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, సంస్థాగత అంశాలపై చర్చ జరుగుతుంది.