May 01,2023 09:02

       వందేళ్ల కిందట మన దేశంలో మొట్టమొదటిసారిగా మే డే జరుపుకున్నాం. 1923లో మే డే సందర్భంగా మద్రాస్‌ మెరీనా బీచ్‌లో కామ్రేడ్‌ సింగరవేలు ఎర్రజెండా ఆవిష్కరించారు. అయితే నేడు మన కార్మిక వర్గం తిరిగి బ్రిటిష్‌ వలస పాలన నాటి పరిస్థితులలోకి నెట్టివేయబడుతోంది. నిమిది గంటల పని, 8 గంటల విశ్రాంతి, 8 గంటల స్వేచ్ఛాధీనం కోసం చేసిన పోరాటానికి చిహ్నం మేడే. కార్మిక వర్గ పోరాటాలు, త్యాగాల ఫలితంగానే 8 గంటల పని విధానం ఏర్పడింది. గరిష్టంగా రోజుకి 8 గంటల పని, వారానికి 48 గంటల పని వుండాలని 1919లో జరిగిన ఐఎల్‌ఓ (అంతర్జాతీయ కార్మిక సంస్థ) మొదటి సమావేశం నిర్ణయించింది. అంతేగాదు, కార్మికులు వర్గపోరాటం ద్వారా మాత్రమే మెరుగైన పని పరిస్థితులను సాధించుకోగలిగారు. సంఘాన్ని ఏర్పాటుచేసుకునే హక్కు, సమ్మె చేసే హక్కు కూడా వారు పొందగలిగారు.
      మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన వెంటనే 1948లో ఫ్యాక్టరీల చట్టం రూపొందించబడింది. స్వాతంత్య్ర పోరాటంలో చురుగ్గా పాల్గొన్న కార్మికవర్గ ఆకాంక్షలు కొంతమేరకు ప్రతిబింబించేలా పని గంటలకు సంబంధించిన కొన్ని సెక్షన్లను ఈ చట్టంలో పొందుపరిచారు. అయితే, పెట్టుబడిదారుల లాభాల పెంపుకోసం ఏర్పడిన నయా ఉదారవాద పాలనలో పని గంటలను పెంచడం ద్వారా, వారు కష్టపడి సాధించుకున్న హక్కులపై దాడి చేయడం ద్వారా కార్మికులను దోచుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి.
        మోడీ ప్రభుత్వం ఆమోదించిన నాలుగు లేబర్‌ కోడ్లలో ఒకటైన ఉపాధి భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితులకు సంబంధించిన నిబంధనల విషయమై సంస్థలకు మినహాయింపునిచ్చే అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఇస్తున్నది. ఆ వెంటనే పలు రాష్ట్ర ప్రభుత్వాలు పని గంటలను 8 నుంచి 12కు పెంచుతూ ఫ్యాక్టరీ చట్టాన్ని సవరించాయి. అయితే కార్మికుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో వాటిలో కొన్ని రాష్ట్రాలు వెనక్కి తగ్గాయి. ఈ క్రమంలోనే బిజెపి పాలనలో వున్న కర్ణాటక, డిఎంకె నాయకత్వంలోని తమిళనాడు ప్రభుత్వం కార్మికుల పనిగంటలను పెంచేలా ఫ్యాక్టరీల చట్టాన్ని సవరించాయి. కార్మిక సంఘాలతో పాటు పాలక డిఎంకె మిత్రపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించడంతో తమిళనాడు ముఖ్యమంత్రి బిల్లును నిలిపివేస్తున్నట్టు ప్రకటించాల్సి వచ్చింది. కార్మికుడి నుంచి మరింత శ్రమను పిండుకోవాలన్నా, యజమాని లాభాలను మరింత పెంచుకోవాలన్నా పని గంటల పెంపు ముఖ్య సాధనంగా ఉపయోగపడుతుందన్నది తెలిసిన విషయమే.
         ద్రవ్యోల్బణం పెరిగిపోతోంటే మరీ ముఖ్యంగా ఆహారం, చమురు ధరలు పెరిగిపోతోంటే...అమెరికా, బ్రిటన్‌, అనేక యూరోపియన్‌ యూనియన్‌ దేశాలలో నిజవేతనాలు పడిపోతున్నాయి. బ్రిటన్‌లో జీవన ప్రమాణాలు 2022లో దారుణంగా పడిపోయాయి. భారత పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన 2022-23 ఆర్థిక సర్వే ప్రకారం గత రెండేళ్లలో సుమారు 36.5 కోట్ల మంది గ్రామీణ కార్మికుల నిజవేతనాలు స్తబ్దుగా వున్నాయి. 2014-15 నుంచి 2021-22 మధ్య నిజ వేతనాల వృద్ధి రేటు ఏడాదికి ఒక్క శాతం కంటే తక్కువగా నమోదైంది.
       ప్రపంచవ్యాప్తంగా కార్మకవర్గం మేడే జరుపుకుంటున్న ఈ సందర్భంలో...పెట్టుబడిదారీ దేశాలలో 8 గంటల పని దినంతో పాటుగా కష్టపడి సాధించుకున్న హక్కులన్నీ దాడికి గురవుతున్నాయి. వేతనాలు, బోనస్‌లు, పింఛన్లు కోతకు గురవుతున్నాయి. పూర్తి పెన్షన్‌ పొందేందుకు రిటైర్మెంట్‌ వయసు పెంచుతున్నారు. కార్మిక సంఘాల హక్కులపై, మరీ ముఖ్యంగా సమ్మె చేసే హక్కుపైన దాడి జరుగుతోంది.
        వ్యవస్థాగత సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న పెట్టుబడిదారీ వ్యవస్థ దాని నుంచి బైటపడే పరిష్కార మార్గాన్ని ఇప్పటికీ కనిపెట్టలేకపోయింది. కార్మిక వర్గం, శ్రమ జీవులు సృష్టించిన అపార సంపదను కొన్ని ధనిక దేశాలలో కొద్దిమంది స్వాధీనం చేసుకుంటున్నారు. అపూర్వమైన శాస్త్రసాంకేతిక పురోగతులను ప్రజా ప్రయోజనాల కోసం గాక, బడా కార్పొరేట్లు, బహుళజాతి కంపెనీల లాభాల కోసం వినియోగిస్తున్నారు. 1970లలో పెట్టుబడిదారీ సంక్షోభానికి పరిష్కారంగా తీసుకొచ్చిన నూతన ఆర్థిక విధానం విఫలమైనట్టుగా చాలా చోట్ల అంగీకరిస్తున్నారు. సంపద సృష్టికర్తలైన కార్మికులకు, ఆ సంపదను సొంతం చేసుకొనే బడా పెట్టుబడిదారులకు మధ్య తీవ్రమౌతున్న వైరుధ్యాలకు పరిష్కారాన్ని కనుగొనలేకపోతున్నట్లు పెట్టుబడిదారీ విధానం గ్రహించింది.
        ఈ తీవ్ర వైరుధ్యాలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న అన్ని రకాల భారీ పోరాటాలలోనూ కనిపిస్తున్నాయి. రవాణా కార్మికులు, రైల్వే కార్మికులు, నర్సులు, డాక్టర్లతో సహా ఇతర ఆరోగ్య రంగ కార్మికులు, టీచర్లు, లెక్చరర్లు, విద్యారంగ ఉద్యోగులు, రిటైల్‌ రంగ కార్మికులు, ప్రభుత్వ రంగ ఉద్యోగులు, ఆటోమొబైల్‌ కార్మికులు, అమేజాన్‌, గూగుల్‌, స్టార్‌బక్స్‌ కార్మికులు, గిగ్‌ వర్కర్లు తదితరులు అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌, జర్మనీ, ఇటలీ, గ్రీస్‌...ఇతర అనేక దేశాలలో మునుపెన్నడూ లేని విధంగా సుదీర్ఘ సమ్మెలకు, అపూర్వమైన పోరాటాలకు దిగుతున్నారు.
మన దేశానికి వచ్చేసరికి 2022 మార్చిలో పది కేంద్ర కార్మిక సంఘాలు ఐక్య వేదికను ఏర్పాటు చేసుకుని రెండు రోజుల పాటు సమ్మె చేశాయి. ఇదిగాక బొగ్గు కార్మికులు, విద్యుత్‌, స్టీల్‌, బ్యాంకు, బీమా, స్కీమ్‌ వర్కర్లు, ప్రభుత్వ ఉద్యోగులు రంగాల వారీగా పోరాటాలు చేపడుతున్నారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగాను, ఇతర డిమాండ్ల సాధన కోసం సమ్మెలు చేస్తున్నారు. ఈ పోరాటాల ధాటికి నూతన ఆర్థిక విధానాలు కొంత మేరకు వెనకపట్టు పట్టాయి. లేబర్‌కోడ్లు పార్లమెంట్‌లో పాసై మూడు సంవత్సరాలైనప్పటికీ వాటిని ప్రకటించలేకపోయింది. స్కీమ్‌ వర్కర్లు పోరాటాల ద్వారా వేతనం, ఇతర బెనిఫిట్లను సాధించుకోగలిగారు. పేదలకు, మరీ ముఖ్యంగా మహిళలు పిల్లలకు సేవ చేసే ఈ పథకాలను ప్రైవేటీకరించకుండా, నిర్వీర్యం చేయకుండా అడ్డుకోగలిగారు. సంయుక్త కిసాన్‌ మోర్చా నాయకత్వాన రైతాంగం చేపట్టిన చారిత్రిక పోరాటంతో మోడీ ప్రభుత్వం దిగివచ్చి మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాల్సి వచ్చింది.
      సంపద సృష్టికర్తలైన కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు తమ ఉమ్మడి సమస్యలపై పోరాడేందుకు కలిసికట్టుగా ముందుకొస్తున్నారు. నేడు కేంద్రంలో అధికారంలో వున్న మోడీ నాయకత్వంలోని బిజెపి ప్రభుత్వం దూకుడుగా అనుసరిస్తున్న నయా ఉదారవాద విధానాలే వారి సమస్యలకు మూల కారణం. అందుకే వీటికి వ్యతిరేకంగా సిఐటియు, ఎఐకెఎస్‌, ఎఐడబ్ల్యుయు ఏప్రిల్‌ ఐదవ తేదీన భారీ మజ్దూర్‌ కిసాన్‌ సంఘర్ష్‌ ర్యాలీని నిర్వహించాయి.
         అయితే, మన దేశంతోపాటు ప్రపంచ స్థాయి అనుభవాలను చూసినట్లయితే కేవలం పోరాటాలే సరిపోవు. నాయకత్వానికి నయా ఉదారవాద విధానాల పట్ల స్పష్టమైన ప్రత్యామ్నాయ దృక్పథం లేకపోవడాన్ని...దోపిడీ పెట్టుబడిదారీ వ్యవస్థకు చెందిన మితవాద శక్తులు అవకాశంగా తీసుకుని ప్రజల్లో వున్న అసంతృప్తి నుంచి ప్రయోజనం పొందుతున్నాయి. ఫ్రాన్స్‌, ఇటలీ, హంగేరి, పోలాండ్‌, నెదర్లాండ్స్‌...వంటి అనేక యూరోపియన్‌ దేశాలలోను, అమెరికాలోను ఇదే విధంగా జరిగింది. మన దేశంలో ఆర్‌ఎస్‌ఎస్‌ నేతృత్వంలోని మతతత్వ విభజన శక్తులు లాభం పొందుతున్నాయి. మితవాద శక్తులు ఉదారవాదాన్ని వ్యతిరేకించకుండా...కులం, మతం, జాతి, భాష పేరిట శ్రామికుల మధ్య చిచ్చు పెట్టి ఐక్య పోరాటాలను బలహీన పరుస్తున్నాయి.
         భారత దేశంలో మనం చూస్తున్నట్టుగా పాలక వర్గాలు మితవాద శక్తులకు మద్దతునిస్తున్నాయి. అపఖ్యాతి పాలైన ఉదారవాదానికి స్పష్టమైన ప్రజానుకూల ప్రత్యామ్నాయాన్ని కలిగివున్న వామపక్షాలు పోరాటాల్లో గెలుపొందకూడదన్నదే వాటి లక్ష్యంగా వుంది. అందుకే, తమ తక్షణ సమస్యలైన పని గంటలు, వేతనాలు, సాంఘిక భద్రత, పని ప్రాంత హక్కులు వంటి వాటికి...ఈ విధానాలను పెంచి పోషించే నయా ఉదారవాద రాజకీయాలకు మధ్య గల సంబంధాన్ని కార్మికులకు, ప్రజలకు తెలియచేయాల్సిన అవసరం ఎంతైనా వుంది. కార్మిక వర్గానికి, శ్రమజీవులకు తమ తక్షణ శత్రువు ఎవరో మిత్రుడు ఎవరో తెలుసుకునేలా చేయాలి. వారి అసలు శత్రువులైన నయా ఉదారవాద విధానాలకు, దోపిడీ పెట్టుబడిదారీ వ్యవస్థకు, పాలక- కాషాయ-కార్పొరేట్‌ శక్తులకు వ్యతిరేకంగా పోరు సల్పేలా దిశానిర్దేశం చేయాలి. దోపిడీ రహిత సమాజాన్ని సాధించుకునే దిశగా కదలాలి.
        కష్టపడి సాధించుకున్న హక్కులను కాపాడుకోవడానికి మాత్రమే కాకుండా...పెట్టుబడిదారీ వ్యవస్థ నుండి మొత్తం సమాజాన్ని విముక్తి చేయడం కోసం పునరంకితమవుదాం. 2023 మేడే నాడు మనం చేస్తున్న ప్రతిజ్ఞ ఇది.

( వ్యాసకర్త సిఐటియు జాతీయ అధ్యక్షురాలు )
కె. హేమలత