May 02,2023 10:00

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను లాగేసుకునేందుకు ప్రభుత్వం పెద్దయెత్తున దాడులకు దిగుతోందని, ఈ దాడులను తిప్పికొట్టేందుకు కార్మిక, కర్షక ఐక్య పోరాటాలను ఉధృతం చేయడమొక్కటే మార్గమని సిపిఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. అంతర్జాతీయ కార్మికవర్గ దినోత్సవం సందర్భంగా సోమవారం నాడిక్కడ సిపిఎం కేంద్ర కార్యాలయం (ఎకెజి భవన్‌) వద్ద అరుణ పతాకాన్ని ఏచూరి ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ, కార్మికవర్గానికి సంఘీభావాన్ని, మేడే శుభాకాంక్షలు తెలియజేశారు. కార్మికులు అనేక త్యాగాలు చేసి పోరాడి సాధించుకున్న ఎనిమిది గంటల పని దినాన్ని తుంగలో తొక్కి పన్నెండు గంటల పని విధానాన్ని కేంద్రం తీసుకొచ్చిందని విమర్శించారు.

111


          మేడే విశిష్టత, కార్మికులపై కాల్పులు, ఆ తరువాత మేడే ప్రకటన వంటి చారిత్రాత్మక అంశాలను ఆయన వివరించారు.
      ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడిదారీ, సామ్రాజ్యవాద శక్తులు పెద్దయెత్తున లాభాలు పిండుకునేందుకు ప్రజలపై దాడులను తీవ్రతరం చేస్తున్నాయని అన్నారు. ప్రపంచం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నదని అన్నారు. ఆర్థిక సంక్షోభం వెన్నంటే రాజకీయ సంక్షోభం కూడా తలెత్తుతున్నదని ఆయన చెప్పారు. ప్రపంచంలో నెలకొన్న సమస్యలను అంతం చేయడానికి కార్మికులంతా ఐక్యంగా పోరాడాలని, కార్మికుల పోరాట ఐక్యతను బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లో మరీ ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాల్లో కార్మికులు, కర్షకులు, కష్ట జీవుల పోరాటాలు పెరిగాయని అన్నారు.

222


         దేశంలో స్వాతంత్రం రాకముందు కార్మికుల రక్షణ కోసం పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను మోడీ ప్రభుత్వం ఒక్క కలం పోటుతో రద్దు చేసిందని ఆయన విమర్శించారు.. కేంద్రం తీసుకొచ్చిన పన్నెండు గంటల పని దినానికి అనుగుణంగా చాలా రాష్ట్రాలు చట్టాలు చేయడం శోచనీయమని అన్నారు. దేశ ప్రజల సంపదను కార్పొరేట్లు లూటీ చేస్తున్నాయని, దీనికిి వ్యతిరేకంగా కూడా ఆందోళనలు ఉధృతం చేయాలని సిపిఐ(ఎం) నేత కోరారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా కార్మికులు, రైతులు ఆందోళనలు చేస్తున్నారు. ఈ ఐక్య ఉద్యమాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరముందని ఆయన ఉద్ఘాటించారు. ఈ పోరాటల్లో యువత, విద్యార్థులు, మహిళలు భాగస్వామ్యం కావాలని ఏచూరి కోరారు. .ఈ కార్యక్రమంలో సిపిఐ(ఎం) పొలిట్‌ బ్యూరో సభ్యులు ప్రకాశ్‌ కరత్‌, సుభాషిణి అలీ, సిఐటియు అధ్యక్షురాలు కె.హేమలత, ఐద్వా ప్రధాన కార్యదర్శి మరియం ధావలే, ఎఐకెఎస్‌ ప్రధాన కార్యదర్శి విజూ కృష్ణన్‌, సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు మురళీధరన్‌, అరుణ్‌ కుమార్‌, విక్రమ్‌ సింగ్‌, అవదేశ్‌ కుమార్‌, ఎఐకెఎస్‌ ఉపాధ్యక్షులు, మాజీ పొలిట్‌ బ్యూరో సభ్యులు హన్నన్‌ మొల్లా తదితరులు పాల్గొన్నారు.

333



                                              ఎర్ర జెండా రెపరెపలు : దేశవ్యాప్తంగా ఘనంగా మేడే వేడుకలు

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : దేశంలో ఎర్ర జెండా రెపరెపలాడింది. దేశ రాజధాని ఢిల్లీ నుంచి గల్లీ వరకు దేశవ్యాప్తంగా నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో కార్మికులు గొంతెత్తారు. అంతర్జాతీయ కార్మిక దినోత్సవం (మేడే)ను పురస్కరించుకుని దేశవ్యాప్తంగా వేడుకలు నిర్వహించరాఉ. ఎర్రజెండాలను చేబూని నినాదాలు ఇచ్చుకుంటూ కార్మికులు ప్రదర్శనలు చేపట్టారు. ఎక్కడికక్కడే జెండాలు ఆవిష్కరించారు. మేడే అమరవీరుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ ప్రస్తుత పాలకుల కార్మిక వ్యతిరేక విధానాలపై గర్జించారు. జాతాలు, బహిరంగ సభలు, ర్యాలీలు, మోటర్‌ సైకిల్‌, ఆటో ర్యాలీలు జరిగాయి. రాష్ట్రాల్లో తమ సాంస్కృతిక కళారూపాలు ప్రదర్శించారు. ఢిల్లీ, కేరళ, పశ్చిమ బెంగాల్‌, త్రిపుర, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, బీహార్‌, ఒడిశా, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, పంజాబ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, ఉత్తరప్రదేశ్‌, ఝార్ఖండ్‌, గోవా, హర్యానా, అస్సాం, మణిపూర్‌, సిక్కిం, మేఘాలయ, నాగాలాండ్‌, మిజోరం రాష్ట్రాల్లో మేడే వేడుకలు భారీగా జరిగాయి. కేంద్ర పాలిత ప్రాంతాలు జమ్మూకాశ్మీర్‌, పుదుచ్ఛేరి, అండమాన్‌ నికోబర్‌ దీవుల్లో కూడా మేడే కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరిగాయి. కార్మికులకు రైతు, విద్యార్థి, యువజన, మహిళ, సమాజిక సంఘాలతో పాటు ఇతర ప్రజా సంఘాలు మద్దతుగా ర్యాలీలు చేపట్టాయి. త్రిపురలోని అగర్తలలో జరిగిన ర్యాలీలో మాజీ ముఖ్యమంత్రి, సిపిఎం పొలిట్‌ బ్యూరో సభ్యులు మానిక్‌ సర్కార్‌ పాల్గొన్నారు. తమిళనాడులో సిపిఎం కార్యాలయం వద్ద సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు రామకృష్ణన్‌ జెండా ఆవిష్కరించారు. జమ్మూకాశ్మీర్‌లోని శ్రీనగర్‌లో జరిగిన ర్యాలీలో సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు యూసఫ్‌ తరిగామి పాల్గొన్నారు.