May 02,2023 09:27
  • రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా మేడే వేడుకలు
  • మరో పోరాటానికి సిద్ధం కావాలి : నేతలు

ప్రజాశక్తి - యంత్రాంగం : రాష్ట్రవ్యాప్తంగా ఎరుపు జెండా రెపరెపలాడింది. మేడే సందర్భంగా సిఐటియు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. జోరు వర్షంలోని ర్యాలీలు, పతాకావిష్కరణలు చేపట్టారు. వేలాది మంది కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాల ఫలాలను స్మరించుకున్నారు ప్రస్తుతం కార్మిక చట్టాలను కాలరాస్తున్న మోడీ ప్రభుత్వంపై మరో పోరాటానికి కార్మికవర్గం సిద్ధం కావాలని పలువురు నేతలు పిలుపునిచ్చారు.

22


       ఎన్‌టిఆర్‌ జిల్లా వ్యాప్తంగా 300 సెంటర్లలో అరుణ పతాకాలను ఆవిష్కరించారు. విజయవాడ పడమటలో నిర్వహించిన బహిరంగ సభలో సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి.హెచ్‌. నర్సింగరావు మాట్లాడుతూ..పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను ఈ రోజు నాలుగు లేబర్‌కోడ్‌లుగా కేంద్రం మార్చిందన్నారు. మేడే స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేయాలని కోరారు. కార్మిక సమస్యలను పరిష్కరిస్తామని హామీనిచ్చిన ప్రభుత్వాలు గద్దెనెక్కిన తర్వాత ఒక్క సమస్యను కూడా పరిష్కరించలేదని విమర్శించారు. రాణిగారి తోట, కృష్ణలంకలో నిర్వహించిన సభల్లో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు చిగురుపాటి బాబూరావు, సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు వి ఉమామహేశ్వరరావు, రాష్ట్ర నాయకులు సుబ్బరావమ్మ, అజరుకుమార్‌్‌ తదితరులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా వ్యాప్తంగా వేడుకలు నిర్వహించారు. అనంతపురంలో మున్సిపల్‌ కార్యాలయం నుంచి సప్తగిరి సర్కిల్‌, టవర్‌క్లాక్‌ మీదుగా కృష్ణకళా మందిరం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు ఎవి.నాగేశ్వరరావు మాట్లాడుతూ..కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక సంరక్షణ చట్టాలను కేంద్రం ప్రభుత్వం కాలరాస్తోందన్నారు. శ్రమదోపిడి, వెట్టిచాకిరీలోకి వారిని నెట్టివేస్తోందని ధ్వజమెత్తారు. విభజన హామీలు అమలు చేయకుండా రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిందన్నారు. రాష్ట్రంలోని పార్టీలు ప్రజావ్యతిరేక మోడీవైపు ఉంటాయో..రాష్ట్ర అభివృద్ధి వైపు ఉంటాయో తేల్చుకోవాలని సూచించారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో జరిగిన సభలో సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు, తణుకులో జరిగిన సభలో వ్యవసాయ కార్మిక సంఘం మాజీ రాష్ట్ర నాయకులు మంతెన సీతారాం పాల్గొని మాట్లాడారు. కార్మిక హక్కులు, చట్టాలపై మోడీ ప్రభుత్వం తీవ్రమైన దాడి చేస్తోందన్నారు. మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే ఈ సమస్యకు పరిష్కారమని తెలిపారు. కార్మిక చట్టాలు లేకపోతే కార్మికులు మళ్లీ బానిసలుగా బతికే రోజులు వస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేట్లకు రాయితీలు, శ్రమ జీవులపై భారాలు మోపే బిజెపి ప్రభుత్వానికి చరమగీతం పాడాలన్నారు.కర్నూలులో సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు డి.గౌస్‌ దేశారు, రాష్ట్ర నాయకులు పి.నిర్మల పాల్గొని, మాట్లాడారు. కార్మిక వ్యతిరేక ప్రభుత్వాలు గద్దె దిగాలని డిమాండ్‌ చేశారు. మేడే స్ఫూర్తితో ఉద్యమాలను ఉధృతం చేయాలన్నారు. పెరిగిన ధరలను అనుగుణంగా కార్మికులకు వేతనాలు పెంచాలని డిమాండ్‌ చేశారు. జోరు వర్షంలోనూ తూర్పుగోదావరి, డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ, కాకినాడ జిల్లాలో వేడుకలు నిర్వహించారు. కాకినాడలో సిఐటియు అఖిలభారత ఉపాధ్యక్షులు జి.బేబిరాణి పాల్గొన్నారు. గుంటూరు జిల్లా వ్యాప్తంగా వేడుకలు నిర్వహించారు. తాడేపల్లిగూడెం ప్రజాశక్తి ప్రింటర్స్‌ భవనం వద్ద వేడుకలు నిర్వహించారు. అంతకు ముందు విజేతలకు బహుమతులు ప్రదానోత్సవం చేశారు. ఎడిటర్‌ తులసీదాస్‌ మాట్లాడారు. అంతర్జాతీయ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. కార్మికుల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తోన్న తీరును వివరించారు. సిజిఎం అచ్యుతరావు, తదితరులు పాల్గొన్నారు. పల్నాడులో కౌలురైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వై రాధాకృష్ణ పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లాలో 30 మండలాల్లోనూ పతాకావిష్కరణలు జరిగాయి. విశాఖ జిల్లాలో 350 సెంటర్లలో ఎర్రజెండాలు ఎగురవేశారు. ఉమ్మడి ప్రకాశం,కడప, తిరుపతి, విజయనగరం జిల్లాల్లో ఘనంగా వేడుకలు నిర్వహించారు.

33


                                                       పనిగంటలు 12 కాదు... 8గంటలే : సిపిఎం

విజయవాడలోని సిపిఎం రాష్ట్ర కార్యాలయం ఎదుట ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు పతకావిష్కణ చేశారు. ఆయన మాట్లాడుతూ.. కార్మికులు బలిదానంతో పోరాడి సాధించుకున్న ఎనిమిది గంటల పని విధానాన్ని మోడీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తూ 12 గంటల విధానాన్ని చట్టసవరణ చేయడం దుర్మార్గమైన చర్య అని అన్నారు.. శ్రమను పిండి అదానీ, అంబానీలకు కట్టబెట్టే మోడీ విధానాలకు వ్యతిరేకంగా పోరాడటానికి మేడేని స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఎవరిని ఉద్దేశించి మన్‌కీబాత్‌ మాట్లాడుతున్నారో ప్రధాని చెప్పాలని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజాఉద్యమాలపై అనుసరిస్తున్న నిర్బంధ పద్దతులను ఖండించి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం కార్మికవర్గం ముందున్న కర్తవ్యమని పేర్కొన్నారు. విశాఖ స్టీలు ప్లాంటును పరిరక్షించుకునేందుకు ఈ నెల 3న విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట వేదిక రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన రాస్తారోకోలు, ఆందోళనకు సిపిఎం సంపూర్ణ మద్దతు ఇస్తుందని తెలిపారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి తులసీదాస్‌, రాష్ట్ర కమిటీ సభ్యులు అండ్ర మల్యాద్రి, జయరామ్‌, ఎపి రైతు సంఘం సీనియర్‌ నాయకులు వై కేశవరావు, డివైఎఫ్‌ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమణ తదితరులు పాల్గొన్నారు.