Dec 27,2022 11:57

పెదబయలు (అల్లూరి సీతారామరాజు) : పెదబయలు మండల కాఫీ రైతుల సమస్యలను అడిగి తెలుసుకునేందుకు పలు గ్రామాల్లో సిపిఎం బృందం పర్యటించింది. ఈ సందర్భంగా మంగళవారం స్థానిక మండల సిపిఎం కార్యాలయంలో జరిగిన విలేకారుల సమావేశాన్ని ఉద్దేశించి అనేక గిరిజన సమస్యలపై పి.అప్పల నరస్స మాట్లాడుతూ .... ఈ రాష్ట్రంలో అటవీ ప్రాంతం మొత్తాన్ని అదానిలాంటి కార్పోరేట్‌ కంపెనీలకు అప్పగించాలని నరేంద్ర మోడీ, జగన్మోహన్‌ రెడ్డి చేస్తున్న కుట్రలన్నీ తిప్పి కొట్టాలని ప్రజలందరికీ సిపిఎం పిలుపునిస్తుందన్నారు. నేడు భారత రాష్ట్రపతిగా ఆదివాసి మహిళను పెట్టి ఆదివాసి అటవీ ప్రాంతాలన్నిటి సంపదను మొత్తాన్ని కార్పొరేట్‌ వ్యక్తుల పరం చేయాలని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒక ప్రణాళిక బద్ధంగా పనిచేస్తుందని ఆరోపించరు. పలు ప్రాజెక్టుల కోసం 15 వేలఎకరాల అటవీ భూమిని ధారాదత్తం చేయటం కోసం కుట్రపూరితంగా చర్యలు చేస్తున్నారని మండిపడ్డారు. గిరిజన హక్కులను కాపాడాలని కోరారు. నాలుగేళ్ల నుండి కాపీ రైతులకు చెల్లించవలసిన సుమారు 60 కోట్ల రూపాయలు చెల్లించకపోవడంతో, సప్లాన్‌ నిధులు ఇవ్వకపోవడంతో గిరిజన ప్రజలందరూ ఆర్థిక ఇబ్బందులతో అల్లాడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాపీకి గిట్టుబాటు ధరనివ్వకుండా అధికారులు మోసం చేస్తున్నారని అన్నారు. పాచిపెంట్‌ కాపీకి కిలో 500 రూపాయలు, చెరీ కాపీకి 250 రూపాయలు, మిర్యాలకు 1000 రూపాయలు గిట్టుబాటు ధర ఇవ్వాలని సిపిఎం పార్టీ డిమాండ్‌ చేస్తున్నదన్నారు. కాఫీ రైతులందరికీ అటవీ భూ పత్రాలు ఇచ్చి వారికి రక్షణ ప్రభుత్వం కల్పించాలని కోరారు. గిరిజనులకు జరుగుతున్న అన్యాయాలపై పోరాడాలని సిపిఎం పిలుపునిస్తుందన్నారు. ప్రజాసంఘాలు, ఉద్యోగ సంఘాలు, మేధావులు కలిసి ఉద్యమించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు బోండా సన్నిబాబు, సిపిఎం పెదబయలు మండల కార్యదర్శి కొమ్మ పఅథ్వి రాజు, సిపిఎం మండల కమిటీ సభ్యులు సరబన్న, బుజ్జి బాబు పాల్గొన్నారు.