ప్రజాశక్తి-కాకినాడ : చలో విజయవాడను విజయవంతం చేయాలని సి.పి.ఎస్.ఉద్యోగులు తలపెట్టిన చలో విజయవాడ పోస్టర్ ను సంఘ రాష్ట్ర కార్యదర్శి రవి కుమార్, రాష్ట్ర ఫాప్టో డిప్యూటీ సెక్రటరీ జెనెరల్ సాయి శ్రీనివాస్, కాకినాడ జిల్లా ఫాప్టో చైర్మన్ చక్రవర్తి, కో చైర్మన్ కాశీ విశ్వనాథ్ ల ఆధ్వర్యంలో ఆదివారం కాకినాడ లో ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్బంగా సి.పి.ఎస్.ఉద్యోగుల సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.రవి కుమార్ మాట్లాడుతూ సెప్టెంబర్ 1 న తలపెట్టిన వై నాట్ ఓ.పి.ఎస్.కార్యక్రమంలో భాగంగా చలో విజయవాడ ర్యాలీ ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి హామీ ని తుంగలో తొక్కారని ఇది ప్రతి ఉద్యోగికి తీవ్ర ఆవేదనను కలిగిస్తుందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగులు అంతా సమైక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఫాప్టో డిప్యూటీ సెక్రటరీ జనరల్ సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ పాత పెన్షన్ కావాలని పోరాటం చేస్తుంటే మరో కొత్త పెన్షన్ జి.పి.ఎస్.అమల్లోకి తేవడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని దాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ అడ్డుకుంటామని తెలిపారు. సెప్టెంబర్1న విజయవాడలో అన్ని ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు కలిపి పాత పెన్షన్ కోసం పోరాటం చేస్తామని ప్రకటించారు. సి.పి.ఎస్.ఉద్యోగుల సంఘ జిల్లా బాధ్యులు ఎస్.కె.వి.బాషా మాట్లాడుతూ దేశంలో హామీ ఇవ్వని రాష్ట్రాలలో పాత పెన్షన్ విధానం అమలు చేస్తుండగా హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన రాష్ట్రంలో జి.పి.ఎస్.అంటూ మరో కొత్త పెన్షన్ విధానానికి తెర తీయడం ఉద్యోగుల ను వంచించినట్టేనని ఆవేదన వ్యక్తంచేశారు. సి.పి.ఎస్. ఉద్యోగుల సెప్టెంబర్1 చలో విజయవాడ వై నాట్ ఓ.పి.ఎస్.కార్యక్రమానికి ఉపాధ్యాయ సంఘాలు సంపూర్ణ మద్దతు ఇచ్చాయని, ప్రతి ఒక్కరూ పాల్గని విజయవంతం చేయాలని జిల్లా ఫాప్టో చైర్మన్, కో చైర్మన్ లు చక్రవర్తి, కాశీ విశ్వనాధ్ లు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సి.పి.ఎస్.సంఘం నాయకులు చింత నారాయణ మూర్తి, వెంకటేశ్వరరావు, మియా ఖాన్, కఅష్ణం రాజు, అలిమ్, నందీశ్వర్, యూటీఫ్ అధ్యక్షుడు నగేష్, ప్రభాకర వర్మ, ఎస్ టి యు కార్యదర్శి మోర్తా శ్రీనివాస్, ఏ .పి. టి. ఎఫ్ నాయకులు ఫిలిప్ రాజు, సుబ్రహ్మణ్యం, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.










