Jul 08,2023 21:36

ప్రజాశక్తి-గుంటూరు :ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించకపోతే మరో బిఆర్‌టిఎస్‌ ఉద్యమం తప్పదని ఆంధ్రప్రదేశ్‌ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) రాష్ట్ర చైర్మన్‌ ఎన్‌.వెంకటేశ్వర్లు హెచ్చరించారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ఫ్యాప్టో దశల వారీ పోరాటంలో భాగంగా గుంటూరులో ఫ్యాప్టో జిల్లా చైర్మన్‌ ఎం.కళాధర్‌ అధ్యక్షతన ఉమ్మడి జిల్లా సదస్సు శనివారం జరిగింది. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో జగన్మోహన్‌రెడ్డి తాను అధికారంలోకి వస్తే ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తానని, మెరుగైన పిఆర్‌సి ఇస్తామని, సకాలంలో డిఎలు, బకాయిల చెల్లిస్తామని, కాంట్రాక్ట్‌ ఉద్యోగుల క్రమబద్దీకరిస్తామని, సిపిఎస్‌ రద్దు చేస్తామని అనేక హామీలిచ్చి ఒక్కటి కూడా అమలు చేయలేదన్నారు. నాలుగేళ్లలో ఒక్కరోజు కూడా ఉద్యోగ సంఘాల నేతలను చర్చలకు పిల్లవలేదని తెలిపారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో చర్చలకు పిలిచి అన్నీ పరిష్కరిస్తామని చెప్పుడం విడ్దూరంగా ఉందన్నారు. విద్యా రంగంలో 117 జిఒ పేరుతో పాఠశాలలను, ఉపాధ్యాయుల సంఖ్యను కుదింపు చర్యలు చేపట్టారని తెలిపారు. సిపిఎస్‌ అయినా, జిపిఎస్‌ అయినా రెండూ కార్పొరేట్ల లాభాల కోసమేనని, వాటిని ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోబోమని స్పష్టం చేశారు. ఒపిఎస్‌ను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రిన్సిపల్‌ సెక్రెటరీ ప్రవీణ్‌ ప్రకాష్‌ పాఠశాలలను సందర్శిస్తూ ప్రభుత్వ విద్యను, ఉపాధ్యాయులను కించపరిచే విధంగా మాట్లాడటాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. ఉపాధ్యాయ బదిలీలను అపహస్యం చేసే విధంగా ప్రభుత్వం చేపట్టిన సిఫార్సు బదిలీలను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ హామీలు, ఇతర ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి సెప్టెంబర్‌ వరకూ ఆందోళనలు కొనసాగిస్తామని తెలిపారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని పెద్ద ఎత్తున చేపడతామని హెచ్చరించారు.