ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల కలెక్టర్ కార్యాలయాల వద్ద శనివారం జరిగిన ధర్నా కార్యక్రమం విజయవంతమయిందని ఫ్యాప్టో చైర్మన్ నక్కా వెంకటేశ్వర్లు, సెక్రటరీ జనరల్ చెన్నుపాటి మంజుల ఒక ప్రకటనలో తెలిపారు. 14వేల మంది ఉపాధ్యాయులు వివిధ జిల్లాల్లో ఈ ధర్నాలో పాల్గన్నారని పేర్కొన్నారు. పాత పెన్షన్ స్కీం అమలు చేయాలని డిమాండ్ చేశారు. పాఠశాలల విలీనం పేరుతో తీసుకొచ్చిన జివో 117 వల్ల పాఠశాల వ్యవస్థ చిన్నాభిన్నం మయిందని, దీనిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 117 జివో రాష్ట్రవ్యాప్తంగా 181 పాఠశాలలు మూతపడ్డాయని, అనేక ఎస్జిటి పోస్టులు రద్దు అయ్యాయని తెలిపారు. ఈ విద్యాసంవత్సరం 3లక్షల మంది విద్యార్ధులు ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రైవేట్ బడులకు వెళ్లారని పేర్కొన్నారు. ఉపాధ్యాయులకు విపరీతమైన పని ఒత్తిడి పెరిగిందని ఒక అభద్రతాభావంతో ఉపాధ్యాయులు ఉన్నారని తెలిపారు. తనిఖీల పేరుతో ఉపాధ్యాయులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు. ఇంత ఒత్తిడికి ఉపాధ్యాయులను గురిచేస్తే నాణ్యమైన విద్యను విద్యార్ధులకు ఎలా అందించగలరని ప్రశ్నించారు. ఫ్యాప్టో పిలుపుమేరకు ధర్నాని విజయవంతం చేసినందుకు ఉపాధ్యాయులందరికీ అభినందనలు తెలిపారు.










