ఈ కాలం వర్షాలను తెస్తుంది. వర్షాలతో పాటు అనారోగ్య సమస్యలనూ మోసుకొస్తుంది. మరి ఇంట్లోని పెద్దల, పిల్లల ఆరోగ్య పరిరక్షణ కోసం ఏం చేయాలి? చిన్న చిన్న జాగ్రత్తలతో, చిట్కాలతో మనం ఏవిధంగా సన్నద్ధం కావాలి ?

చర్మం, జుట్టు సంరక్షణ : వర్షానికి తడిస్తే తొలుత ప్రభావం పడేది చర్మంతోపాటు వెంట్రుకల మీదే. తల తడిగా ఉన్నప్పుడు చుండ్రు అధికమవుతుంది. పేలూ పడతాయి. తలో చుండ్రు రావడం.. ఆ తర్వాత మొహంపై మొటిమలు రావడం జరుగుతుంది. ఇతర ఇన్ఫెక్షన్లు బాధించే అవకాశం కూడా ఉంది. అందుకే తల తడవకుండా గొడుగు లాంటివి ఉపయోగించాలి. తడిసి ఇంటికి వచ్చిన వెంటనే తలస్నానం చేయాలి.
కలుషిత ఆహారం వద్దు : వర్షాకాలంలో ఉండే అధిక తేమ జీర్ణశక్తిని తగ్గిస్తుంది. బ్యాక్టీరియా, వైరస్‌లు, పరాన్నజీవులు, విష పదార్థాల వల్ల ఆహారం, నీరు కలుషితమవటంతో వివిధ అనారోగ్య సమస్యలు చుట్టుముట్టే అవకాశం ఉంది. ఈ అనారోగ్య పరిస్థితులను వర్షాకాలంలో తప్పించుకోవటం అనివార్యమే. వైరస్ వ్యాప్తికి దోహదపడే కలుషిత ఆహారం, చల్లని పదార్థాలను తీసుకోవద్దు.
పరిసరాల పరిశుభ్రత : వర్షాకాలంలో శారీరకంగా, వ్యక్తిగతంగా జాగ్రత్తలు తీసుకోవడమే కాదు. ఇంటి పరిసరాల గురించి కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడే ఆరోగ్యంగా ఉండగలుగుతారు. ముఖ్యంగా వర్షాకాలంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు పడటంతో ఇంట్లో కొన్ని వస్తువులు తేమగా ఉంటాయి. ఎక్కువ తడి, తేమ చేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
దోమలు, ఈగలు : వానాకాలంలో దోమలు, ఈగలు పెరుగుతాయి. కొన్ని రకాల జ్వరాలు, అంటువ్యాధుల వ్యాప్తికి అవే కారణం. మనం పరిసరాల్లో నీటిని నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ఇంట్లోగానీ ఇంటి పరిసరాల్లోగానీ దోమలు కనిపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
ఫంగల్ ఇన్ఫెక్షన్లు : వర్షంలో తడిస్తే ఇంటికి రాగానే పాదాలను శుభ్రంగా కడుక్కోవాలి. ఆ తరువాత తడిలేకుండా తుడుచుకోవాలి. వర్షాకాలంలో ఎక్కువగా తడవడం వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్ సోకే అవకాశం ఉంది. అంటువ్యాధులు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంటికి రాగానే కాళ్ళను గోరు వెచ్చని నీటితో కడుక్కోవాలి.
ఎక్కువసార్లు బాగా కాచి వడపోసిన నీటిని తాగుతూ ఉండాలి. ఎలాంటి పరిస్థితుల్లోనూ మంచి నీటిని నేరుగా తాగటం మంచిది కాదు. జ్వరం వచ్చి రెండు రోజుల వరకు తగ్గకుండా ఉంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించండి.
వేడి పదార్థాలను తీసుకోవాలి. వర్షాకాలంలో కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ తీసుకోకూడదు.

పిల్లల ఆరోగ్యం జాగ్రత్త !
వర్షాకాలంలో చిన్నారులకు తరచూ జలుబు, దగ్గు వంటి అనారోగ్య సమస్యలు వస్తాయి. వర్షంలో తడవడం వల్ల తరచూ జలుబు, దగ్గు, జ్వరం లాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి. వర్షాకాలంలో చిన్నారులకు వేడి నీటితోనే స్నానం చేయించాలి. తలంటు స్నానం చేయించేటప్పుడు వేడి నీటిలో కొన్ని చుక్కల నువ్వుల నూనె వేయాలి. దీనివల్ల పిల్లల్లో శ్వాసకోశ సమస్యలు తగ్గుతాయి. కొంచెం పసుపు, ఉప్పు కలిపిన మిశ్రమాన్ని చిన్నారులతో తినిపించాలి. తర్వాత గోరు వెచ్చని నీరు తాగించాలి. ఇలా చేస్తే జలుబు, దగ్గు నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది. గొంతు నొప్పి, దగ్గు సమస్యతో బాధపడుతున్న చిన్నారులకు ఉప్పు, వాము, పసుపు కలిపి వేడి చేసి చిన్న గుడ్డలో కట్టుకోవాలి. దాంతో గొంతుపై నెమ్మదిగా కాపడం పెట్టాలి. ఇలా చేస్తే త్వరగా ఉపశమనం లభిస్తుంది.
పసుపు కొమ్ములు, గోధమలను సమాన మొత్తంలో తీసుకుని వాటిని నూనె లేకుండా దోరగా వేయించాలి. తర్వాత మెత్తని పొడిగా తయారు చేసుకోవాలి. ఈ పొడిని కొంత మొత్తంలో ఉదయం, సాయంత్రం పిల్లలకు ఇవ్వాలి. ఇలా చేస్తే శ్వాసకోశ సమస్యలు, దగ్గు తగ్గుతాయి.
వాము ఒక టీస్పూన్, బెల్లం 4 టీస్పూన్లు తీసుకుని వాటిని మెత్తగా నూరుకోవాలి. ఈ కషాయాన్ని పిల్లలతో తాగించాలి. ఇలా చేయడం వల్ల జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటివి తగ్గుతాయి. ఇన్ఫెక్షన్‌తో ఇబ్బంది పడుతున్న చిన్నారులకు పసుపు, పటికబెల్లం పొడిని బొగ్గు నిప్పుపై వేసి చిన్నారులతో పట్టించాలి. ఇలా చేయడం వల్ల గొంతు ఇన్ఫెక్షన్ తగ్గుతుంది.

గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం, తేనె కలిపి పిల్లలతో తాగించాలి. ఇలా రోజుకు రెండు సార్లు తాగిస్తే మంచి ప్రయోజనం ఉంటుంది.
వారానికి కనీసం మూడు నాలుగు సార్లు ఆకుకూరలు తింటే ఎంతో మంచిది. ఉడకబెట్టిన సెనగలు, వేరుసెనగలు, అల్సందలు మొదలైన వాటిని వారానికి రెండు మూడుసార్లు స్నాక్‌లా తింటే మంచిది. వారానికి నాలుగసార్లు తెల్ల నువ్వుల ఉండలు, పల్లీ ఉండలు, సున్నుండలు తింటే వంటికి ఎంతోబలం.
సీజనల్‌గా దొరికే పండ్లను వారానికి రెండు మూడుసార్లు తింటే ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. నానబెట్టిన బాదంపప్పును స్నాక్‌లాగా తినొచ్చు.
జీడిపప్పు, పిస్తాపప్పు వంటివి కూడా మంచిదే. కానీ పరిమితంగా మాత్రమే తినాలి.
ఉసిరికాయ, తానికాయ, కరక్కాయలను త్రిఫలాలు అంటారు. వీటితో త్రిఫల చూర్ణం తయారుచేస్తారు. వీటిలో విటమిన్-సి, ఫైటో కెమికల్స్, పైటో న్యూట్రియంట్స్, పాలీఫినాల్స్, అసెన్షియల్ ఆయిల్స్ ఉంటాయి. పోషకాల కంటే ఇందులో ఔషధ గుణాలే ఎక్కువ. ఈ చూర్ణాన్ని సమాన పరిణామంలో తీసుకుంటే ఉపయోగకరం.

సంపూర్ణ పోషక వైద్య నిపుణురాలు










