దైనందిన జీవితంలో భాగమైన ఎన్నో విషయాలను బహిరంగంగా చర్చిస్తుంటాం. ఆహారం, నిద్ర, ఆరోగ్యం వంటి అంశాలెన్నో ఆ చర్చల్లో పెద్ద గొంతుకతో వినపడతాయి. కాని సాధారణ జీవితంలో భాగమైన రుతుక్రమం గురించి మాత్రం చర్చించేందుకు ఎవరూ ముందుకురారు. గ్రామాల్లోనే కాదు, పట్టణాలు, నగరాల్లో కూడా ఇదే పరిస్థితి. కాని ఇది బిడియపడాల్సిన విషయం కాదు. రుతుక్రమాన్ని జీవక్రియగా పరిగణించాలి. దానిచుట్టూ అల్లుకున్న అపోహలను తొలగించే అవగాహన రావాలి.
2030 నాటికి రుతుక్రమాన్ని సాధారణ జీవితంలో భాగంగా చేయాలని, రుతుక్రమం చుట్టూ ఉన్న అపోహలు, మూఢనమ్మకాలు తొలగిపోవాలని రెండేళ్లుగా ఒకే థీమ్‌తో రుతుక్రమ పరిశుభ్రతా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. అయితే..
2022 మే 5న జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే విడుదల చేసిన ఒక నివేదిక ప్రకారం మన దేశంలో 64.4 శాతం మంది 15 నుండి 24 ఏళ్ల వయస్సు వారు శానిటరీ ప్యాడ్లను ఉపయోగిస్తున్నారు. 49.6 శాతం మంది క్లాత్ నాప్కిన్లు వినియోగిస్తున్నారు. 15 శాతం మంది స్థానికంగా దొరికే ఉత్పత్తులు వాడుతున్నారు. కేవలం 0.3 శాతం మంది మాత్రమే కప్స్ ఉపయోగిస్తున్నారు. ఇక రుతుక్రమ పరిశుభ్రతపై అవగాహన ఉన్నవారి సంఖ్య కూడా చాలా తక్కువే. నివేదిక ప్రకారం 77.6 శాతం మంది మాత్రమే పరిశుభ్రతను పాటిస్తున్నారని తేలింది.
- పరిశుభ్రత ఎందుకు పాటించాలి..
రుతుక్రమంలో పాటించే పరిశుభ్రత అనేక వ్యాధుల నుండి రక్షిస్తుంది. అంతేకాదు, సమాన విద్య, సమాన అవకాశాలను మెరుగుపరుస్తుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. కాని విచారించదగ్గ విషయమేమంటే ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల మందికి రుతుక్రమ పరిశుభ్రత ఉత్పత్తులు లేదా సౌకర్యాలు అందడం లేదు. ఈ పరిస్థితి వారి విద్య, ఆరోగ్యం, మొత్తం జీవనంపై ప్రభావం చూపిస్తోంది.
- విద్య పాత్ర..
రుతుక్రమ పరిశుభ్రతపై అవగాహన ఉండడం వల్ల వారి చుట్టూ ఉన్న కమ్యూనిటీని కూడా చైతన్యం చేయగలుగుతారు. తద్వారా ఆ అంశం చుట్టూ పేరుకుపోయిన అంధకారం తొలగిపోతుంది. కాబట్టి వ్యక్తులుగా చైతన్యం చేయడమే కాక వ్యవస్థను మార్చేందుకు కూడా పలు వర్క్‌షాపులు నిర్వహించాలి.
- ఆ ధోరణి మారాలి..
ఇప్పటికీ రుతుక్రమ అంశాల్లో అనేక కళాంకాలు చాలా కమ్యూనిటీల్లో కనిపిస్తుంటా యి. రుతుక్రమంలో ఉన్నప్పుడు ఆమెని అపవిత్రురాలిగా చూస్తారు. ఎందుకు పనికిరానిదిగా పక్కనబెడతారు. ఆ సమయం లో వారు అపరిశుభ్రంగా ఉన్నామని భావిస్తారు. దూరంగా వెలివేయబడడం వారిని కుంగదీస్తుంది. ఈ వివక్ష వారిని ఆత్మన్యూనతకు గురిచేస్తుంది.
- చర్చలు జరపాలి..
రుతుక్రమ పరిశుభ్రతపై వీలైనన్ని సార్లు చర్చలు జరపాలి. బహిరంగ ప్రదేశాల్లో పలు కార్యక్రమాల ద్వారా అవగాహన కల్పించాలి. పురుషులను, బాలురను కూడా ఈ చర్చల్లో భాగస్వామ్యం చేయడం వల్ల సానుకూల దృక్పథం ఏర్పడుతుంది.
మే 28 రుతుక్రమ పరిశుభ్రతా దినోత్సవ సందర్భంగా మరోసారి ఆ విషయాలు బహిరంగంగా చర్చిద్దాం. మన చుట్టూ ఉన్నవారికి అవగాహన కల్పిద్దాం.










