Jun 26,2023 22:35
  • ప్యాంగాంగ్‌ వీధుల్లో లక్షలాదిమంది ప్రదర్శన
  • ప్రతీకారం తీర్చుకుంటామని ప్రతినలు

ప్యాంగాంగ్‌ : అమెరికా సామ్రాజ్యవాదాన్ని ఉత్తర కొరియా ప్రజలు తీవ్రంగా ఖండించారు. యుద్ధానికి ప్రతీకారం తీర్చుకుంటామని ప్రతిన బూనారు. ఆదివారం దాదాపు లక్షా 20వేల మంది ప్రజలు ప్యాంగాంగ్‌ వీధుల్లోకి వచ్చారు. కొరియా యుద్ధం ప్రారంభమై 73ఏళ్లు అయిన సందర్భంగా వారు భారీగా ప్రదర్శనలు నిర్వహించారని స్థానిక మీడియా సోమవారం తెలిపింది. ప్రదర్శనల్లో పాల్గొన్న వారిలో ప్రధానంగా కార్మికులు, యువత, విద్యార్థులే వున్నారు. రాజధానిలోని మే డే స్టేడియం వద్ద, నగరంలోని వివిధ ప్రాంతాల్లో వీరు ప్రదర్శనలు నిర్వహించారని ప్రభుత్వ మీడియా సంస్థ కెసిఎన్‌ఎ తెలిపింది. ఉత్తర కొరియాను సమూలంగా తుడిచిపెట్టేందుకు అమెరికా సామ్రాజ్యవాదులు చేపట్టిన యుద్ధానికి ప్రతీకారం తీర్చుకుంటామని వారు ప్రతినబూనారని మీడియా పేర్కొంది. లక్షా 14వేలుమంది పట్టే సామర్ధ్యం కలిగిన స్టేడియం లోపల గల జనసందోహం ఫోటోలను ప్రభుత్వ మీడియా ప్రచురించింది. 'యావత్‌ అమెరికా భూభాగం మా కాల్పుల పరిధిలోనే వుంది.', ''సామ్రాజ్యవాద అమెరికా శాంతి విధ్వంసకర్త' అని రాసి వున్న ప్లకార్డులను ప్రదర్శకులు చేబూనడం కనిపించింది. ఉత్తర కొరియా ప్రముఖులు పలువురు ఈ ర్యాలీలకు హాజరయ్యారు. సైనిక ఘర్షణ వైపు, అణ్వాయుధ విన్యాసాల మైపు అమెరికా మొగ్గిందంటూ పేరు వెల్లడించని ఒక వక్త వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితి అమెరకా దూకుడు స్వభావాన్ని వెల్లడిస్తోందని, తరాలు మారినా ఈ తీరు మారదని ఆయన విమర్శించారు. కొరియా ద్వీపకల్పాన్ని ఏకం చేయాలనే ప్రయత్నంలో ఉత్తర కొరియా, దక్షిణ కొరియాపై దండెత్తినప్పుడు 1950 జూన్‌ 25న కొరియా యుద్ధం ఆరంభమైంది. మూడేళ్ల పాటు సాగిన ఈ యుద్ధంలో దాదాపు 20లక్షల మంది చనిపోయారు. శాంతి ఒప్పందం కన్నా కాల్పుల విరమణ ఒప్పందంతోనే ఆనాటి యుద్ధం విరమించినా ఉత్తర, దక్షిణ కొరియాలు ఇప్పటికీ సాంకేతికంగా యుద్ధం చేస్తున్నటే. నెలల తరబడి ఆయుధాల పరీక్షలు సాగిన తర్వాత ప్యాంగాంగ్‌లో ఈ ర్యాలీలు జరిగాయి. మొదటిసారిగా సైనిక నిఘా ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు గత నెలలో ఉత్తర కొరియా ప్రయత్నించి విఫలమైంది. త్వరలోనే దీనిపై రెండోసారి ప్రయోగం వుంటుందని అధికారులు చెప్పారు. దేశ మిలటరీని ఆధునీకరిస్తామని ఏప్రిల్‌లో ఉత్తర కొరియా నేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ ప్రతిన చేశారు. అమెరికా దురాక్రమణ వైఖరి నేపథ్యంలో తాము సైనికంగా ఆయుధాలు సమకూర్చుకోవడం అవసరమని ఆయన ఉద్ఘాటించారు. అణు యుద్ధాన్ని రేకెత్తించేందుకు అమెరికా ప్రయత్నాలు చేస్తోందని ఉత్తర కొరియా విదేశాంగ మంత్రిత్వ శాఖ విడిగా ఒక ప్రకటనలో సోమవారం విమర్శించింది.