ఉత్తర కొరియా విమర్శ
సియోల్ : ప్రచ్ఛన్న యుద్ధం అవశేషంగా జి-7 దేశాలను ఉత్తర కొరియా విమర్శించింది. ఆ దేశాలు తమ సొంత ప్రయోజనాల కోసం ఘర్షణలు సృష్టిస్తాయని, ఇతర దేశాల సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘిస్తాయని ఉత్తరకొరియా ప్రభుత్వ మీడియా కెసిఎన్‌ఎ మంగళవారం తెలిపింది. గత వారం టోక్యోలో సమావేశానంతరం విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో ఉత్తర కొరియా ఆత్మరక్షణ చర్యలను, చట్టబద్ధమైన సార్వభౌమాధికారాన్ని జి-7 దేశాల విదేశాంగ మంత్రులు విమర్శించడాన్ని ప్యాంగాంగ్ విదేశాంగ శాఖ ఉన్నతాధికారి ఒకరు తీవ్రంగా తప్పుబట్టారు. ఇటీవల అంతర్జాతీయ సంక్షోభం పెచ్చరిల్లడానికి జి-7 దేశాలే కారణమని విదేశాంగ శాఖ అంతర్జాతీయ విభాగ డైరెక్టర్ జనరల్ జో చోల్ సూ విమర్శించారు.
అంతర్జాతీయ శాంతిని, భద్రతను ధ్వంసంచేసే అత్యంత ప్రధానమైన, ప్రమాదకరమైన మూలం జి-7 అని ఆయన వ్యాఖ్యానించారు. న్యాయమైన అంతర్జాతీయ వ్యవస్థ ఏర్పడకుండా అడ్డుకునేది కూడా ఆ దేశాలేనన్నారు. జి-7 అనేది అంతర్జాతీయ సమాజాన్ని ప్రతిబింబించదని, కేవలం కొన్ని దేశాల ప్రయోజనాలను మాత్రమే పరిరక్షిస్తుందని అన్నారు. ఉక్రెయిన్‌కు ప్రధానంగా ఆయుధ సరఫరాదారు అమెరికానే అని విమర్శించారు.