బీజింగ్ : అమెరికా నేతృత్వంలోని జి-7 దేశాల కూటమి తన ఇష్టాన్ని ఇతరులపై రుద్దేందుకు యత్నిస్తోందని చైనా విమర్శించింది. ప్రపంచ వ్యవహారాల్లో అమెరికా నేతృత్వంలోని ఈ కూటమి పెత్తనాన్ని అంతర్జాతీయ సమాజం ఎంత మాత్రం అంగీకరించబోదని తేల్చి చెప్పింది. అది ముందుకు తెచ్చిన పాశ్చాత్య అనుకూల నియమనిబంధనలను అంగీకరించాల్సిన అగత్యం ప్రపంచానికేమీ లేదని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆదివారం విడుదలజేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. కొద్ది మంది ఏకపక్షంగా విధించిన నియమాలను చైనా ఎన్నటికీ అంగీకరించదు. సిద్ధాంతాలు, విలువల ఆధారంగా ప్రపంచాన్ని చీల్చడమే ఈ పాశ్చాత్య ఆధిపత్య నిబంధనల అసలు లక్ష్యమని చైనా విదేశాంగ శాఖ విమర్శించింది. కొద్ది సంఖ్యలో ఉన్న పశ్చిమ దేశాలు ఇతర దేశాల ఆంతరంగిక వ్యవహారాల్లో చీటికీ మాటికీ తలదూర్చడం, 'అమెరికా ఫస్ట్' విధానాలకనుగుణంగా ప్రపంచ వ్యవహారాలను శాసించే రోజులు పోయాయి. జి-7 అనేది అమెరికా, కెనడా, జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్, ఇటలీ జపాన్ దేశాలతో కూడిన క్లబ్బు మాత్రమే. అంతకుమించి దీనికి ఎలాంటి ప్రాధాన్యత లేదు. ప్రపంచాన్ని రెండుగా చీల్చేందుకు జరుగుతున్న యత్నాలు ప్రమాదకరమైనవని ఐరాస మరో వైపు హెచ్చరించింది. జి-7 కూటమి శుక్రవారం విడుదలజేసిన డిక్లరేషన్‌లో చైనానుద్దేశించి టెక్నాలజీ దొంగిలించడం, ఆర్థిక నిర్బంధం, మానవ హక్కుల ఉల్లంఘన వంటి ఆరోపణలను గుప్పించింది. హాంగ్‌కాంగ్, టిబెట్, షింజియాంగ్ చైనా అంతర్గత వ్యవహారాలని వీటిలో ఇతర దేశాల జోక్యాన్ని సహించేది లేదని చైనా విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. దక్షిణ చైనా సముద్రం, తైవాన్‌కు సంబంధించి యథాతథ స్థితిని మార్చేందుకు జరిగే ఎలాంటి యత్నాన్నైనా చైనా గట్టిగా వ్యతిరేకిస్తుందని ఆ ప్రకటన పేర్కొంది. తైవాన్ వేర్పాటువాద శక్తులకు మద్దతు ఇవ్వడం ద్వారా జి-7 ఈ ప్రాంతంలో శాంతి సుస్థిరతలకు ముప్పుగా తయారైందని చైనా విమర్శించింది.