డాక్టర్ దీపక్‌కు దూర ప్రాంతాలకు సైక్లింగ్ చేయడం అలవాటు. ఆ దారిలో అనుకోకుండా ఎదురైనా ఓ పాప వైకల్యాన్ని తొలగించే వరకూ ఆయన పట్టు వదల లేదు. ముక్కు, ముఖం తెలియని ఆ పాపకు మంచి భవిష్యత్తు ఇవ్వాలన్న తలంపుతో భారం మొత్తం తన మీదే వేసుకున్నాడు. పెద్ద పెద్ద వైద్యుల మాట్లాడారు. వేల కిలోమీటర్లు ప్రయాణించాడు. సాహసంతో కూడిన శస్త్రచికిత్సను ధైర్యంగా చేయించాడు. లక్షలతో కూడుకున్న వైద్యాన్ని ఉచితంగా అందించి ఆ బాలిక తలెత్తుకొని నడిచేలా చేశాడు.
గత ఏడాది గుజరాత్‌కు చెందిన తొమ్మిది మంది సీనియర్ సిటిజన్స్ కోటేశ్వర్ నుంచి అరుణాచల్ ప్రదేశ్‌లోని కిబితు వరకు 40 రోజుల పాటు సైకిల్ యాత్రకు బయల్దేరారు. అందులో 69 ఏళ్ల డాక్టర్ దీపక్ కులకర్ణి ఉన్నారు. గత ఏడాది డిసెంబర్‌లో వారి సైకిల్ యాత్ర అసోం నుంచి అరుణాచల్‌ప్రదేశ్‌లోని సన్‌పురాకు చేరుకుంది. అక్కడ వివేకానంద కేంద్ర విద్యాలయ స్కూలు సిబ్బంది ఈ బృందానికి ఆశ్రయం ఇచ్చి భోజన ఏర్పాట్లు చేశారు. ఉదయం స్కూల్ గ్రౌండ్‌లో జరుగుతున్న పెరియడ్‌లో క్రీడల ఆవశ్యకత, చదువు శ్రద్ధపై ఉపన్యాసం ఇచ్చాడు దీపక్. ఆ సమయంలో మెడను ఏటూ కదపకుండా, ఓ వైపు తలవాల్చి ఉన్న పది ఏళ్ల బాలిక ముస్కాన్‌ను చూశారు. ఆ బాలిక టోర్టికోలిస్ అనే మెడ వైకల్యంతో పుట్టింది. ఉపాధ్యాయులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
మాక్సిల్లోఫేషియల్ సర్జన్‌గా దీపక్‌కు 45 ఏళ్ల అనుభవం ఉంది. పాపకు సర్జరీ చేస్తే వైకల్యం తొలగిపోతుందని సలహా ఇచ్చారు. ఇలాంటి వైకల్యాన్ని శస్త్రచికిత్సతో తొలగించొచ్చు అని, ఆలస్యం చేయకుండా వైద్యం చేయాలని ప్రధానోపాధ్యాయులకు సూచన చేశారు. ముస్కాన్ తల ఒక వైపుకు వంగి ఉంటుంది. వయస్సు చిన్నదే కాబట్టి సమస్య తొలగిపోవచ్చు అని డాక్టర్ చెప్పారు. ఆమె తల్లిదండ్రులతో మాట్లాడి తనను సంప్రదించమని హెచ్‌ఎంకి సూచించారు. తన ఫోన్ నెంబర్, అడ్రస్ వివరాలను ఇచ్చి, బృందంతో కలిసి సైకిల్ యాత్రలో సాగిపోయారు. కానీ, తనకు ఏ రోజూ ఆ ఊరి నుంచి కాల్ రాలేదు.
యాత్ర పూర్తి చేసి, ఇంటికి చేరిన దగ్గర నుంచి దీపక్ ఆ పాప గురించే ఆలోచించసాగాడు. శస్త్ర చికిత్స చేయించకపోతే భవిష్యత్తులో ఆ పాప జీవితం చాలా దుర్భరంగా ఉంటుందని ఆవేదన చెందాడు. ముస్కాన్ తల్లిదండ్రులతో మాట్లాడే ప్రయత్నం కూడా చేశాడు. కానీ, వారు ఏ సన్నద్ధతా వ్యక్తం చేయలేదు.
రెడు నెలల తర్వాత పాప మేనమామ దీపక్‌కు ఫోన్ చేసి శస్త్రచికిత్స గురించి అడిగాడు. ముస్కాన్‌కు నిజంగా మెడ వస్తుందా? తల నిలబెట్టగలదా? గ్యారెంటీ ఇవ్వగలరా? ప్రాణ హాని ఉండదు కదా? అంటూ అతడు అడిగిన ప్రశ్నలు దీపక్‌కు కొంత బాధ కలిగించాయి. అయినా పాప వైకల్యాన్ని తొలగించాలన్న పట్టుదల ఒక్కటే ఆయన మనసులో ఉంది. ముస్కాన్‌కు ఎటువంటి ప్రమాదమూ లేదని, పాప బాధ్యత తనదంటూ హామీ ఇచ్చాడు. ఆమె కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పాడు. వారి ఆర్థిక పరిస్థితి తెలిసి ప్రయాణ ఖర్చులకు డబ్బు పంపించాడు.
అందరూ కలిసి మూడు వేల కిలోమీటర్లు ప్రయాణించి పూణేలో ఉన్న సాసూన్ జనరల్ హాస్పిటల్‌కు చేరుకున్నారు. అక్కడ ప్లాస్టిక్ సర్జరీ విభాగం అధిపతి డాక్టర్ పరాగ్ సహస్ర బుధేతో దీపక్ మాట్లాడారు. పాప పరిస్థితి వివరించారు. ఆమెకు పరీక్షలు చేసి రిపోర్టులన్నీ తీసుకుని పై అధికారులతో మాట్లాడారు. వైద్యులు పాప కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ చేశారు. తరువాత ఈ ఏడాది ఏప్రిల్ 8న ఐదుగురు వైద్యులు కలిసి ముస్కాన్‌కు మెడ భాగానికి సర్జరీ చేశారు. ముస్కాన్ కుటుంబసభ్యులు ఇబ్బంది పడకుండా దీపక్ ఏర్పాట్లు చేశాడు. పాప నొప్పుల నుంచి బయటపడేలా పెయింటింగ్ పుస్తకాలను తీసుకొచ్చి దగ్గరుండి వర్క్ చేయించేవారు. ప్రతిరోజూ పాపను చూసేందుకు ఆసుపత్రికి వచ్చి, మంచి మాటలు చెబుతూ, ఆత్మవిశ్వాసం నింపేవారు. ఇప్పుడు ఆ బాలిక ఆరోగ్యం పూర్తిగా మెరుగుపడింది. దీపక్ చేసిన మేలుకు ఆమె కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు చెప్పుకున్నారు.
పుట్టకతోనే వైకల్యంతో ముస్కాన్ జన్మించింది. అది చూసి తల్లిదండ్రులు కుంగిపోయారు. కూతురు పరిస్థితి, భవిష్యత్తు తలచుకుంటూ ఏడ్వని రోజంటూ లేదు. ఆమెకు పెళ్లి కాదని నిరాశపడ్డారు. కానీ, డాక్టర్ దీపక్, పరాగ్ ఆమెకు వైకల్యం తొలగించి, జీవితంపై ఆశలు కల్పించారు. ఇప్పుడు ముస్కాన్ తల ఎత్తుకొని నడుస్తోంది. ప్రతిరోజూ తనకిష్టమైన పాటలకు డ్యాన్స్ చేస్తుంది. పిల్లలతో కలిసి ఆడుకుంటుంది. తన వయస్సులో ఉన్న ఇతర పిల్లల్లాగానే సాధారణ జీవితాన్ని గడుపుతోంది.










