ప్రజాశక్తి - చాపాడు (కడప) : స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం ఆశా డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా అడిషనల్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ డా.ఖాదరవల్లి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో ఎన్‌ఎల్పీఈలో భాగంగా ప్రతి ఇంటిని ఆశ కార్యకర్తలు సందర్శించి, లెప్రసీ లక్షణాలు ఉన్న వాళ్లను గుర్తించాలని తెలిపారు. అదేవిధంగా ప్రైవేటు ఆసుపత్రుల డాక్టర్లు లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే వారి మీద ఖచ్చితముగా కఠినమైన చర్యలు తీసుకుంటామన్నారు. గర్భవతులు తప్పకుండా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలు అయ్యేలా సిబ్బంది అవగాహన కల్పించాలని సూచించారు. గర్భణీలు తప్పకుండా మంచి పోషక విలువలు ఉన్న ఆహారాన్ని తీసుకొని రక్తహీనత లేకుండా కాపాడుకోవాలని తెలియజేశారు. అప్పుడే పుట్టిన పసిపిల్లలకి తల్లిపాలు అమృతంతో సమానమని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీవాణి, డా. కావ్య మాధురి, డా. ఓబులేష్, డిఎంహెచ్ ఓ శ్రీనివాసులు, సూపర్వైజర్ సరస్వతి, ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.










