Nov 05,2023 11:09

న్యూఢిల్లీ : కోర్టు తీర్పులను చట్టసభలు నేరుగా అధిగమించలేవని భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్‌ స్పష్టం చేశారు. అయితే చట్టంలోని ''లోపాన్ని సరిచేయడానికి'' చట్టసభలు కొత్త చట్టాన్ని రూపొందించవచ్చునని అన్నారు. శనివారం ఒక మీడియా సంస్థ నిర్వహించిన సమావేశంలో కార్య నిర్వాహక, శాసన, న్య్యాయవ్యవస్థల మధ్య అధికారాల విభజనపై మాట్లాడుతూ, చంద్రచూడ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. 'కోర్టు తీర్పు వచ్చినప్పుడు చట్టసభ ఏమి చేయగలదో.. ఏమి చేయలేదో అనే దానికి మధ్య విభజన రేఖ ఉంది. ఒక నిర్దిష్ట సమస్యను నిర్ణయించే న్యాయస్థానం తీర్పు ఒక చట్టంలోని లోపాలను ఎత్తిచూపినట్లయితే, ఆ లోపాన్ని సరిదిద్దటానికి తాజా చట్టాన్ని రూపొందించడానికి చట్టసభలకు ఎల్లప్పుడూ అవకాశం ఉంటుంది. కోర్టు తీర్పు తప్పు అని భావిస్తున్నామని, అందువల్ల తీర్పును రద్దు చేస్తామని చట్టసభ చెప్పలేదు' అని చంద్రచూడ్‌ తెలిపారు. 'న్యాయస్థానం యొక్క తీర్పును చట్ట సభ నేరుగా తిరస్కరించజాలదు.. అది ఎంతమాత్రం అనుమతించరానిది' అని అన్నారు. 1951లో విద్యాసంస్థలకు రిజర్వేషన్‌ నిబంధనలు వర్తింపజేయబోమని సుప్రీంకోర్టు తీర్పు పేర్కొన్నప్పుడు, విద్యాసంస్థల్లో రిజర్వేషన్లు తీసుకొచ్చేందుకు పార్లమెంట్‌ చట్టాన్ని సవరించిందని చంద్రచూడ్‌ గుర్తు చేశారు.
         'న్యాయమూర్తులు కేసులను పరిష్కరించినప్పుడు సమాజం ఎలా స్పందిస్తుందో చూడరు' అని అన్నారు. 'ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వానికి, ప్రజల చేత ఎన్నిక కాని న్యాయవ్యవస్థకు మధ్య ఉన్న వ్యత్యాసం ఇది. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం వారి స్పందనలకు ప్రతిస్పందిస్తుంది. న్యాయవ్యవస్థ ఇలా చూడదు' అని అన్నారు. న్యాయమూర్తులు రాజ్యాంగ నైతికతకు లోబడి నడుచుకుంటారే తప్ప ప్రజాకర్షక నైతికతకు కాదని ఆయన అన్నారు. న్యాయమూర్తులు ప్రజలచే ఎన్నుకోబడకపోవడం మన న్యాయ వ్యవస్థ ప్రక్రియ యొక్క బలం అని, అది ''లోపం'' కాదని ఆయన అన్నారు. అలాగే .న్యాయవ్యవస్థలో మహిళలు, అట్టడుగు వర్గాలకు తగిన ప్రాతినిధ్యం లేకపోవడాన్ని గురించిన ప్రశ్నలకు సమాధానమిస్తూ, ''న్యాయవాద వృత్తిలోకి ప్రవేశించే సమయంలోనే నిర్మాణాత్మక అడ్డంకులు ఉన్నాయి'' వాటిని పరిష్కరించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఉదాహరణకు సిఎల్‌ఎటి (కామన్‌ లా అడ్మిషన్‌ టెస్ట్‌)ను ఎక్కువగా ఆంగ్లంలో నిర్వహిస్తారని, దీంతో పట్టణ ప్రజలు, సౌకర్యాలు ఎక్కువగా ఉన్న ప్రజలు ఈ పరీక్షలో ఎక్కువగా ఉత్తీర్ణత సాధిస్తారని తెలిపారు.