Oct 31,2023 11:06

న్యూఢిల్లీ : ప్రజా జీవనంలో హాస్యస్ఫూర్తి అనేది చచ్చిపోయిందని ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్‌ వ్యాఖ్యానించారు. ఆప్‌ ఎంపి రాఘవ్‌ చద్దాపై నిరవధిక సస్పెన్షన్‌ కేసు విచారణ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మీడియాతో మాట్లాడుతూ చమత్కారంగా చద్దా చేసిన వ్యాఖ్యలకు ఆయనపై సస్పెన్షన్‌ వేటు పడింది. జిఎన్‌సిటిడి (సవరణ) బిల్లు, 202 సెలక్ట్‌ కమిటీలో చేరేందుకు ఇతర సభ్యులకు 'పుట్టిన రోజు ఆహ్వాన కార్డులు'ను చద్దా పంపారని, ఇతర సభ్యుల ఆమోదం తీసుకోకుండానే చద్దా వారిని ఆహ్వానించారని విమర్శిస్తూ సభా హక్కుల ఉల్లంఘన కింద సస్పెండ్‌ చేసినట్లు కారణం తెలిపారు. దానిపై చంద్రచూడ్‌ స్పందిస్తూ 'పుట్టినరోజు ఆహ్వాన పత్రికలు పంపడమంటే ఆ సభ్యులు రావచ్చు, రాకపోవచ్చు, అది సభ ప్రతిష్టను దిగజార్చడం అవుతుందా? సభా హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందా?'' అని చంద్రచూడ్‌ అటార్నీ జనరల్‌ ఆర్‌.వెంకటరమణిని ప్రశ్నించారు. అటువంటి వ్యాఖ్యలు సభా ప్రక్రియను దిగజారుస్తాయంటూ వెంకటరమణి మాట్లాడుతుండగానే మధ్యలో చంద్రచూడ్‌ జోక్యం చేసుకుని ఇదేమీ ప్రత్యేక హక్కును ఉల్లంఘించే పరీక్ష కాదని అన్నారు. సభ నుంచి ప్రతిపక్ష సభ్యులను మినహాయించడం చాలా తీవ్రమైన అంశమన్నారు. ఆయన అభిప్రాయం ఆయనకు వుంటుంది, ప్రభుత్వ అభిప్రాయంతో ఏకీభవించాల్సిన అవసరం లేదు, పార్లమెంట్‌లో ప్రతిపక్షాల వాణిని బహిష్కరించకుండా జాగ్రత్త తీసుకోవాలని చంద్రచూడ్‌ వ్యాఖ్యానించారు.