
న్యూఢిల్లీ : ప్రజాస్వామ్య వ్యవస్థలను ఉపయోగించుకుని బిజెపి నియంతృత్వం దిశగా పయనిస్తోందని ఢిల్లీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎపి షా విమర్శించారు. న్యాయస్థానాలను, మీడియాను నిర్వీర్యం చేయడం, భిన్నాభిప్రాయాలను అణిచివేయడం ఆ ధోరణికి నిదర్శనం అని అన్నారు. మైనారిటీలు భయంతో జీవిస్తుంటే... కోర్టులు చూస్తూ ఉన్నాయని అన్నారు. మనుస్మృతికి మద్దతుగా వాదించే న్యాయమూర్తులు మెజారిటీ భాష మాట్లాడుతున్నారని అన్నారు. బిజెపిని 'ఎన్నికైన నియంతృత్వం'గా అభివర్ణించిన ఆయన, విడి సావర్కర్ కాలం చెల్లిన హిందుత్వ ఆశయాలను అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. మైనారిటీలను లక్ష్యంగా చేసుకుని నూహ్, ఢిల్లీ అల్లర్లతోపాటు, న్యాయవ్యవస్థను సవాలు చేసే బుల్డోజర్ రాజకీయాలను కూడా ఆయన విమర్శించారు. అణగారిన ప్రజల జీవితాలను పునర్నిర్మించడానికి ఎవరు సహాయం చేస్తారు? అని అన్నారు. దీనిని ప్రశ్నించిన పంజాబ్ - హర్యానా హైకోర్టు బెంచ్ నుంచి కేసు బదిలీ చేయబడింది కూడా అని గుర్తు చేశారు. మానవ హక్కుల కార్యకర్తలపై వేటు వేసే పాలనకు మద్దతిచ్చేలా సుప్రీం కోర్టు తరచూ చేస్తున్న చర్యలను విమర్శిస్తూ తీస్తా సెతల్వాద్ ఉదంతమే ఇందుకు మంచి ఉదాహరణ అని పేర్కొన్నారు.