
ప్రజాశక్తి -యలమంచిలి (పశ్చిమగోదావరి) :పశ్చిమగోదావరి జిల్లా చించినాడ పంచాయతీ పరిధిలోని పెరుగులంక దళితుల భూముల్లో అధికార యంత్రాంగం చేపట్టిన అక్రమ మట్టి తవ్వకాలను తక్షణం ఆపాలని, లేకుంటే సంబంధిత అధికారులపై న్యాయపరమైన పోరాటం చేస్తామని సుప్రీంకోర్టు న్యాయవాది, పౌర హక్కుల సంఘం రాష్ట్ర కార్యదర్శి పొత్తూరి సురేష్ కుమార్, హైకోర్టు న్యాయవాది, పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ముప్పాళ్ల సుబ్బారావు హెచ్చరించారు. పౌరహక్కుల నేతలు శనివారం ఆయా భూముల్లో పర్యటించి, అక్రమ మట్టి తవ్వకాలను పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. గోదావరి చెంతన మట్టి తవ్వకాలకు అనుమతులు ఇవ్వడమే నిబంధనలకు విరుద్ధమని, కాంట్రాక్టర్ కేవలం 65 సెంట్ల భూమిలో మట్టి తవ్వకానికి అనుమతులు తీసుకున్నారని, అది కూడా 20 రోజులకు మాత్రమేనని తెలిపారు. రెండు నెలలుగా సుమారు పది ఎకరాల్లో మట్టిని బయటకు తరలించి ఇటుక బట్టీలకు, ప్రయివేటు వ్యక్తులకు అమ్ముకుంటున్నారని, ఇంత జరుగుతున్నా జిల్లా అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. అడ్డుకున్న పేదలపై లాఠీఛార్జి చేసి కేసులు పెట్టారంటే అధికార యంత్రాంగం ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తుందో అర్థమవుతుందన్నారు. సహజంగా ఉండాల్సిన నది మార్గాన్ని సైతం మళ్లించే విధంగా మట్టి తవ్వకాలకు ఎవరైతే అనుమతులిచ్చారో వారిపై సర్వీసు రూల్ ప్రకారం ఫిర్యాదు చేసి అవసరమైతే జాతీయ పొల్యూషన్ శాఖకు, జాతీయ పౌర హక్కుల సంఘం కమిటీకి వివరించి అధికారులపై చర్యలు తీసుకునేలా ముందుకెళ్తామని హెచ్చరించారు. అనంతరం పోలీసుల దాడిలో గాయపడిన దళితులను వారు పరామర్శించారు. వారి వెంట కెవిపిఎస్ రాష్ట్ర కార్యదర్శి అండ్ర మాల్యాద్రి, సీనియర్ న్యాయవాది పగిడిపల్లి రాము, ఐలు జిల్లా అధ్యక్షులు కామన మునిస్వామి, న్యాయవాదులు పూరిళ్ల శ్రీనివాస్, నెక్కంటి క్రాంతి కుమార్, దళిత సంఘం నేతలు ఉన్నారు.