Oct 17,2023 15:08
  • సాగునీటి కొరత లేకుండా చర్యలు తీసుకోవాలి
  • శివారు ప్రాంత పొలాలకు తీవ్ర నష్టం
  • ప్రభుత్వం రైతులను ఆదుకోవాలి
  • సిపిఎం జిల్లా కార్యదర్శి బలరాం

ప్రజాశక్తి -భీమవరం(పశ్చిమగోదావరి) : అనేక కష్ట నష్టాలు ఓర్చుకుని రైతులు వ్యవసాయం చేస్తుంటే ఆదరించాల్సింది పోయి అగాధంలోకి నెట్టడం దారుణమని సిపిఎం జిల్లా కార్యదర్శి బి.బలరాం విమర్శించారు. పచ్చని పశ్చిమ గోదావరి జిల్లాలో సాగునీటి కొరత లేకుండ చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని అయినా తమకెందుకులే అని పట్టి పట్టినట్లు వ్యవహరించడం దుర్మార్గమన్నారు. స్థానిక మెంటే వారి తోటలోని సుందరయ్య భవనంలో మంగళవారం మాట్లాడారు. ప్రస్తుతం వరిచేలు కీలక దశలో ఉన్నాయన్నారు. ఈ సమయంలో సాగు నీటి అవసరత ఎంతో ఉందన్నారు. అయితే ప్రభుత్వం వ్యవసాయం రైతులు పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో అనేక ఇబ్బందులు ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు. పాలకోడేరు, ఉండి, ఆకివీడు, కాళ్ళ, వీరవాసరం,పెనుమంట్ర, ఆచంట, పోడూరు, పెనుగొండ, యలమంచిలి మండలాల్లో సాగునీటి సమస్య తీవ్రంగా ఉందన్నారు. ముఖ్యంగా కాలువ శివారు గ్రామాల్లోని వరి చేలకు నీరు చేరే పరిస్థితి లేదన్నారు. దీంతో వరి చేలు బీటలు వారుతున్నాయన్నారు. వరిపంట ఈనిక, పొట్టదశ, పాలుపోసుకునే దశలో ఉన్నాయని ఈ నేపథ్యంలో సాగునీటి అవసరత ఎంతో ఉందన్నారు. పరిచేలకు పూర్తిస్థాయిలో నీరందకపోతే పంట దిగుబడులపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందన్నారు. దీంతో రైతాంగం తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే సాగులో లక్షలాది రూపాయలు రైతులు నష్టపోయి అప్పుల ఊబిలో కూరుకు పోయారన్నారు. రైతులకు ప్రభుత్వాలు నుంచి సరైన సాయం అందట్లేదన్నారు . రైతులను ఆదుకోవాల్సిన అవసరం ప్రభుత్వం పై ఉందన్నారు. వ్యవసాయాన్ని రైతులను ఆదుకోకపోతే వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. జిల్లా అధికార యంత్రాంగం, నీటిపారుదల శాఖ, వ్యవసాయశాఖ సమన్వయం చేసుకుని సాగునీటి కొరత లేకుండ ,రైతులు నష్టపోకుండ చూడాలని కోరారు.